Suraj Shivanna: హనీమూన్ వివాదం.. భార్యాభర్తల ఆత్మహత్యతో ముగిసిన 'అరేంజ్డ్' మ్యారేజ్!

Suraj Shivanna Ganavi Suicide Honeymoon Dispute Led to Tragedy
  • బెంగళూరు నవ దంపతుల ఆత్మహత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు
  • అత్త ఒత్తిడితోనే పెళ్లికి అంగీకరించిన గానవి
  • లగ్జరీ వెడ్డింగ్ జరిగినా మనస్తాపం నుంచి బయటపడని వైనం
  • హనీమూన్‌లో భార్య గత స్నేహం గురించి తెలుసుకున్న భర్త
  • ఐదు రోజులకే పర్యటన రద్దు చేసుకుని బెంగళూరుకు
  • ఆపై వేర్వేరుగా ఆత్మహత్య

అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లి రెండు మనసులను కలపలేకపోయింది సరికదా, రెండు నిండు ప్రాణాలను బలిగొంది. శ్రీలంక హనీమూన్ పర్యటనలో వెలుగు చూసిన 'పాత స్నేహం' వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, చివరకు బెంగళూరుకు చెందిన నూతన దంపతుల ఆత్మహత్యలతో విషాదాంతమైంది.

బెంగళూరు విజయ నగర్‌కు చెందిన ఆన్‌లైన్ డెలివరీ సర్వీస్ ఫ్రాంచైజీ యజమాని సూరజ్ శివన్న, ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన గానవి వివాహం అక్టోబర్ 29న అత్యంత వైభవంగా జరిగింది. అయితే, ఈ పెళ్లి గానవికి ఇష్టం లేదని సమాచారం. తన అత్త బలవంతం చేయడంతోనే ఆమె ఈ పెళ్లికి అంగీకరించిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పెళ్లయిన కొన్ని రోజులకే పది రోజుల హనీమూన్ ట్రిప్ కోసం ఈ జంట శ్రీలంకకు వెళ్లింది.

శ్రీలంకలో పర్యటిస్తున్న సమయంలో గానవికి గతంలో ఉన్న ఒక 'స్నేహం' గురించి సూరజ్‌కు తెలిసింది. దీనిపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో ఇకపై ఈ వివాహాన్ని కొనసాగించడం తనకు ఇష్టం లేదని గానవి తేల్చి చెప్పడంతో, పది రోజుల పర్యటనను ఐదు రోజులకే ముగించుకుని డిసెంబర్ 21న వారు బెంగళూరు తిరిగి వచ్చారు.

బెంగళూరు వచ్చిన తర్వాత పెద్దలు రాజీ చేసే ప్రయత్నం చేసినా గానవి వినలేదు. ఆ రాత్రే పుట్టింటికి వెళ్లిన ఆమె, గంటల వ్యవధిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతితో బంధువులు సూరజ్ ఇంటిపై దాడి చేశారు. అదనపు కట్నం కోసం వేధించారంటూ సూరజ్ కుటుంబంపై కేసు నమోదైంది. పోలీసుల అరెస్టుకు భయపడిన సూరజ్, తన తల్లి జయంతితో కలిసి బెంగళూరు నుంచి పరారై, దాదాపు 1,000 కిలోమీటర్ల దూరంలోని నాగ్‌పూర్ చేరుకున్నాడు. శనివారం తెల్లవారుజామున అక్కడ ఒక హోటల్ గదిలో సూరజ్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి జయంతి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించగా, తాడు తెగిపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Suraj Shivanna
Ganavi
Bangalore suicide case
honeymoon dispute
dowry harassment
Srilanka trip
Nagpur hotel suicide
family dispute
police investigation
marriage conflict

More Telugu News