ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం

  • ఒంగోలుకు చెందిన చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్
  • దేవాదాయ ధర్మదాయ శాఖ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • గత టీడీపీ హయాంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్‌గా సేవలందించిన చుండూరి
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

ఒంగోలులో జన్మించి, అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన సీతారామాంజనేయ ప్రసాద్ చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక భావాలతో పెరిగారు. యువకుడిగా ఉన్నప్పుడే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ గుర్తింపు పొందారు.

2014–19 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ పరిధిలోని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (హెచ్‌డీపీటీ) చైర్మన్‌గా ఆయన సేవలందించారు. ఆ సమయంలో రాష్ట్రంలోని అనేక దేవాలయాల జీర్ణోద్ధరణ చేపట్టడంతో పాటు, పలు ప్రాంతాల్లో కోటి దీపోత్సవం, దశ సహస్ర సువాసినీ పూజ వంటి విశిష్ట కార్యక్రమాలను నిర్వహించారు.

హిందూ ధర్మ ప్రచార లక్ష్యంతో ‘ధర్మ శంఖారావం’ అనే మాసపత్రికను కూడా ఆయన ప్రారంభించారు. అదేవిధంగా ఒంగోలు పట్టణంలో ‘గాయత్రి పరివార్’ పేరుతో సంస్థను స్థాపించి, అనేక మంది యువతను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నారు. ఆయన కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ఉచిత అన్నదానం, ఉచిత హోమియో వైద్యసేవల వంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 


More Telugu News