Achchennaidu: ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొన్నాలి: అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు

Achchennaidu and Palla Srinivas Call for Participation in Government Program
  • 'ప్రజల సేవలో ప్రభుత్వం' పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్న టీడీపీ నేతలు
  • ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల హామీలు అమలు చేశామన్న అచ్చెన్నాయుడు
  • విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం పయనిస్తోందన్న పల్లా శ్రీనివాసరావు
  • తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, డీఎస్సీ వంటి హామీల అమలుపై వెల్లడి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు 'ప్రజల సేవలో ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా రేపు, ఎల్లుండి ప్రతి నాయకుడు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించాలని సూచించారు. 

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొత్తగా నియమితులైన పార్లమెంటరీ స్థాయి అధ్యక్షులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో వారు మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వంలో ఎన్నికల హామీలన్నింటినీ వేగంగా అమలు చేశామని స్పష్టం చేశారు. 

ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేసిన కీలక పథకాల వివరాలను ఆయన తెలియజేశారు. 'తల్లికి వందనం' ద్వారా 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10,090 కోట్లు, 'అన్నదాత సుఖీభవ' కింద 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని వివరించారు.

అదేవిధంగా 'స్త్రీ శక్తి' పథకంతో మహిళలకు, అలాగే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని గుర్తుచేశారు. 'దీపం' పథకం కింద అర్హులైన వారికి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అందిస్తున్నామని, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద రూ.50,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికుల సంక్షేమానికి కూడా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. 

ఇప్పటికే డీఎస్సీ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 'స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర' కార్యక్రమం ద్వారా ఇంటింటికీ చెత్త సేకరణ, రూ.4,000 కోట్లతో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టినట్లు పేర్కొన్నారు.

అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గత జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయి అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ఇప్పుడు విధ్వంసం నుంచి వికాసం దిశగా పరుగులు పెడుతోందన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని వివరించారు. 

పార్టీ అందరికీ అవకాశాలు కల్పిస్తుందని, నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ పనితీరును తెలుసుకునేందుకు 'మై టీడీపీ' యాప్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు.
Achchennaidu
Kinjerapu Achchennaidu
Palla Srinivas
Andhra Pradesh
TDP
Chandrababu Naidu
Government Schemes
Telugu Desam Party
AP Politics
Welfare Schemes

More Telugu News