ఒకేసారి 52 ఉపగ్రహాలను ప్రయోగించిన రష్యా

  • నింగిలోకి దూసుకెళ్లిన సోయుజ్-2.1b రాకెట్
  • యూఏఈ కోసం ప్రత్యేక విద్యా ఉపగ్రహం ప్రయోగం
  • భూమిని పర్యవేక్షించేందుకు రెండు కీలక శాటిలైట్లు
  • నౌకల కదలికలను గుర్తించేందుకు వ్యవస్థ విస్తరణ
రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ మరో భారీ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. సోమవారం వోస్టోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి సోయుజ్-2.1b వాహకనౌక ద్వారా ఒకేసారి 52 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. వీటిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కోసం రూపొందించిన ఒక విద్యా ఉపగ్రహం కూడా ఉండటం గమనార్హం.

ఈ ప్రయోగంలో భాగంగా యూఏఈకి చెందిన QMR-KWT-2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. రష్యా, యూఏఈ, కువైట్ మధ్య సహకారాన్ని పెంచడంతో పాటు అరబ్ దేశాల్లో అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తిని పెంపొందించడం, అమెచ్యూర్ రేడియో బ్రాడ్‌కాస్టింగ్ సేవలు అందించడం ఈ ఉపగ్రహం ముఖ్య ఉద్దేశమని స్పుత్నిక్స్ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు.

వీటితో పాటు సముద్రంలో నౌకల కదలికలను గుర్తించేందుకు రష్యా తన శాటిలైట్ ఆధారిత ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS) వ్యవస్థను మరింత విస్తరించింది. ఇందులో భాగంగా పదుల సంఖ్యలో క్యూబ్‌శాట్ 3U ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) టెక్నాలజీని పరీక్షించేందుకు సిట్రో-టీడీ ఉపగ్రహాలను కూడా ప్రయోగించినట్లు కంపెనీ పేర్కొంది.

ఈ ప్రయోగంలో ఏఐఎస్‌టీ-2టీ సిరీస్‌కు చెందిన రెండు ఉపగ్రహాలు ప్రధానమైనవి. ఇవి భూమి ఉపరితలాన్ని ఫోటోలు తీసి, డిజిటల్ మ్యాప్‌లను రూపొందించడంలో సహాయపడతాయి. అగ్నిప్రమాదాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను పర్యవేక్షించేందుకు కూడా ఉపయోగపడతాయి. కనీసం ఐదేళ్ల పాటు పనిచేసేలా ఈ ఉపగ్రహాలను రూపొందించారు. 


More Telugu News