Qari Yaqoob Sheikh: పాకిస్థాన్ లో కొత్త టెర్రరిస్ట్ లీడర్.. హఫీజ్, మసూద్ పనికిరారని భావిస్తున్న పాక్ ప్రభుత్వం

Yaqoob Sheikh New Terrorist Leader in Pakistan
  • ముఖాలు మార్చుకుంటున్న పాకిస్థాన్ టెర్రరిజం
  • తెరపైకి కొత్త ఉగ్ర నేత యాకూబ్ షేక్
  • యాకూబ్ ను 2012లోనే ఉగ్రవాదిగా గుర్తించిన అమెరికా

భారత్‌పై ఉగ్రదాడుల పన్నాగాలకు వేదికగా మారిన పాకిస్థాన్... పేర్లు మారుస్తూ, ముఖాలు మార్చుకుంటూ ఉగ్రవాదాన్ని కొనసాగిస్తూనే ఉంది.


‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పరిస్థితులు కొంత మారినట్టు కనిపించినా, వాస్తవం మాత్రం మరోలా ఉంది. ఒకప్పుడు భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా ఉన్న హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి వాళ్లు ఒక్కసారిగా వార్తల నుంచి మాయమయ్యారు. వారంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదే సమయంలో పాకిస్థాన్ మరో కొత్త ఉగ్ర నేతను ముందుకు తెచ్చిందన్న ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వస్తున్నాయి.


ఆ కొత్త ఉగ్ర నేత పేరు ఖారీ మొహమ్మద్ యాకూబ్ షేక్. లష్కరే తోయిబా నుంచి ఉగ్ర శిక్షణ పొందిన ఇతడు, ఇప్పుడు స్వతంత్రంగా తనకంటూ ఓ కొత్త సంస్థను నిర్మించుకున్నాడు. ఆ సంస్థ పేరు సెంట్రల్ ముస్లిం లీగ్. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ సంస్థను పాకిస్థాన్‌లో ఒక రాజకీయ పార్టీగా నమోదు చేశారు. అంతే కాదు, దీనికి పాక్ సైన్యం పరోక్షంగా మద్దతు ఇస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.


యాకూబ్ షేక్ నేపథ్యం

1972లో పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో జన్మించిన ఖారీ యాకూబ్, మొదట మదర్సాలో చదువు పూర్తిచేసి మతప్రచారకుడిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే క్రమంగా తీవ్రవాద భావజాలానికి లోనై ఉగ్రవాద మార్గంలోకి మళ్లాడు. 2012లోనే అమెరికా అతడిని అధికారికంగా ఉగ్రవాదిగా గుర్తించింది. అప్పట్లో అతడు లష్కరే తోయిబా కోసం పనిచేస్తున్నాడన్న ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌తోనూ అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పలు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి.


2017లో దిఫా-ఏ-పాకిస్థాన్ కౌన్సిల్ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన యాకూబ్ ఓడిపోయాడు. అయినా రాజకీయాల్ని, ఉగ్రవాదాన్ని కలిపి నడిపే ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. 2025 ప్రారంభంలో ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో, యాకూబ్ తాలిబాన్ పాలనకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశాడు. ఇదే అంశం పాక్ సైన్యానికి అతడిని దగ్గర చేసింది. అప్పటి నుంచి యాకూబ్‌కు సైన్యం అండగా నిలుస్తోందన్న ప్రచారం మొదలైంది.


ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 14 మంది మరణించారు. హఫీజ్ సయీద్‌కు చెందిన రహస్య స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరూ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వారు పాక్ సైన్యం నిఘాలోనే భద్రంగా ఉన్నారని సమాచారం. ఇదే సమయంలో పాకిస్థాన్ దేశంలో తెహ్రీక్-ఇ-తాలిబాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి ఉగ్రసంస్థలు సైన్యానికి పెద్ద సవాలుగా మారాయి. వీటిని అణచివేయడంలో పాక్ సైన్యం విఫలమవుతోంది. 


ఈ పరిస్థితుల్లోనే పాకిస్థాన్ మరోసారి పాత పద్ధతికే వెళ్లిందని విశ్లేషకులు చెబుతున్నారు. పాత ఉగ్రనేతలు అయిన హఫీజ్, మసూద్ ఇక పనికిరారని భావించి, వారి స్థానంలో కొత్త ముఖాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నమే ఖారీ యాకూబ్ షేక్ అని అంటున్నారు. ఉగ్రవాదాన్ని రాజకీయాల ముసుగులో దాచిపెట్టి, ప్రపంచాన్ని మభ్యపెట్టే ప్రయత్నం పాకిస్థాన్ చేస్తోందన్న విమర్శలు మరింత బలపడుతున్నాయి. 

Qari Yaqoob Sheikh
Pakistan terrorism
Hafiz Saeed
Masood Azhar
Lashkar-e-Taiba
Jaish-e-Mohammed
Central Muslim League
Tehrik-i-Taliban Pakistan
Baloch Liberation Army
Operation Sindhur

More Telugu News