ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజు
- ప్రకృతి వైద్య సలహాదారుగా సత్యనారాయణ రాజు నియామకం
- ప్రభుత్వ సలహాదారుడిగా పోచంపల్లి శ్రీధర్ రావు
- రెండేళ్ల పాటు పదవుల్లో కొనసాగనున్న మంతెన, శ్రీధర్ రావు
ప్రకృతి వైద్య రంగంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. ఇకపై ఏపీలో ప్రకృతి వైద్య విధానాల ప్రోత్సాహం, ప్రజల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య విధానాల రూపకల్పనలో డాక్టర్ మంతెన ప్రభుత్వానికి సలహాలు అందించనున్నారు.
మంతెన సత్యనారాయణ రాజు గత కొన్ని దశాబ్దాలుగా ప్రకృతి వైద్యాన్ని ప్రజల జీవితాలకు దగ్గర చేసే ప్రయత్నంలో ముందుండి పనిచేస్తున్నారు. మందులపై ఆధారపడకుండా ఆహార నియమాలు, జీవనశైలి మార్పుల ద్వారా అనేక రుగ్మతలకు ఉపశమన మార్గాలు చూపించారు. విజయవాడ సమీపంలోని ఉండవల్లి కరకట్టపై ఏర్పాటు చేసిన ‘ప్రకృతి చికిత్సాలయం’ ద్వారా వేలాది మందికి సేవలందించారు.
అలాగే విజయవాడ, నరసాపురం ప్రాంతాల్లో కూడా ఆయన ఆధ్వర్యంలో ఆరోగ్యాలయం కేంద్రాలు పనిచేస్తూ ప్రజలకు వైద్య సహాయం అందిస్తున్నాయి. టీవీ చానళ్లు, యూట్యూబ్ చానళ్ల వంటి వివిధ మాధ్యమాల ద్వారా కూడా ఆయన ప్రకృతి వైద్య విధానాన్ని విస్తృతం చేస్తున్నారు.
ప్రజారోగ్యాన్ని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం తీసుకుంటున్న విధానాల్లో ప్రకృతి వైద్యానికి ప్రత్యేక స్థానం కల్పించాలనే లక్ష్యంతోనే ఈ నియామకం చేసినట్లు సమాచారం. ఆధునిక వైద్యం తో పాటు ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలను సమన్వయం చేస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేయాలన్న దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
కార్టూనిస్ట్ శ్రీధర్ కు కూడా కీలక పదవి
ఇదే సమయంలో, మాస్ కమ్యూనికేషన్ రంగంలో అనుభవం ఉన్న పోచంపల్లి శ్రీధర్ రావును కూడా ఏపీ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. సమాచార ప్రసారం, ప్రజలతో ప్రభుత్వ కార్యక్రమాల అనుసంధానం వంటి అంశాల్లో ఆయన ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనున్నారు. పోచంపల్లి శ్రీధర్ రావు అంటే ఎవరో కాదు... ప్రముఖ కార్టూనిస్ట్ గా ఆయన పేరుప్రఖ్యాతులు అందుకున్నారు. ఈనాడు దినపత్రికకు సుదీర్ఘకాలం సేవలు అందించారు.
మంతెన సత్యనారాయణ రాజు, పోచంపల్లి శ్రీధర్ రావు ఇద్దరూ రెండేళ్ల పాటు ఈ సలహాదారు పదవుల్లో కొనసాగనున్నారు. ప్రజారోగ్యం, సమాచార వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ నియామకాలు దోహదపడతాయని భావిస్తున్నారు.