విజయ్ మాల్యాతో పార్టీలో వ్యాఖ్యలు.. భారత ప్రభుత్వానికి లలిత్ మోదీ క్షమాపణలు
- విజయ్ మాల్యాతో కలిసి లండన్‌లో పార్టీలో పాల్గొన్న లలిత్ మోదీ
- తాము అతిపెద్ద పలాయనవాదులం అంటూ వ్యాఖ్య
- భారత్‌ను అవమానపరిచేలా వ్యాఖ్యానించారని నెటిజన్ల ఆగ్రహం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపారు. మనీలాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ లలిత్ మోదీ బ్రిటన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన విజయ్ మాల్యాతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "మేం అతిపెద్ద పలాయనవాదులం" అని వారు పేర్కొన్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
ఆ వ్యాఖ్యలు భారతదేశాన్ని అపహాస్యం చేసినట్లుగా ఉన్నాయని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లలిత్ మోదీ, విజయ్ మాల్యా దేశాన్ని మోసం చేసి పారిపోవడమే కాకుండా, విదేశాల్లో భారత్‌ను బహిరంగంగా అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడితున్నారు. నెటిజన్ల ఆగ్రహం నేపథ్యంలో లలిత్ మోదీ క్షమాపణలు చెప్పారు.
తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని లలిత్ మోదీ అన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. తనకు భారత ప్రభుత్వం అంటే గౌరవం ఉందని తెలిపారు. ఇటీవల విజయ్ మాల్యా 70వ పుట్టిన రోజు వేడుకకు లలిత్ మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిరువురు కలిసి ఉన్న వీడియో వైరల్ అయింది.