పాత కంపెనీకి తాళం వేసి... కొత్త ఏఐ స్టార్టప్‌తో రూ. 830 కోట్ల విలువ సాధించిన గూగుల్ మాజీ ఉద్యోగులు

  • లాభాల్లో ఉన్న స్టార్టప్‌ను మూసివేసిన గూగుల్ మాజీ ఉద్యోగులు 
  • చాట్‌జీపీటీ రాకతో ఏఐ భవిష్యత్తును అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకున్న వైనం
  • 'ఎనీథింగ్' పేరుతో ప్రారంభించిన కొత్త ఏఐ కంపెనీ విలువ 100 మిలియన్ డాలర్లు
  • ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని అందుకున్న స్టార్టప్
టెక్నాలజీ ప్రపంచంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. దీని భవిష్యత్తును ముందుగానే అంచనా వేసిన ఇద్దరు గూగుల్ మాజీ ఉద్యోగులు, ఏటా 2 మిలియన్ డాలర్లకు పైగా లాభాలు ఆర్జిస్తున్న తమ స్టార్టప్‌ను మూసివేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వారు ప్రారంభించిన కొత్త ఏఐ స్టార్టప్ విలువ ఏకంగా 100 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 830 కోట్లు) చేరింది.

వివరాల్లోకి వెళితే.. ధ్రువ్ అమిన్, మార్కస్ లోవ్ అనే ఇద్ద‌రు మిత్రులు 'క్రియేట్' పేరుతో ఒక విజయవంతమైన స్టార్టప్‌ను నడిపేవారు. అయితే, 2022 నవంబర్‌లో చాట్‌జీపీటీ ప్రారంభమైన తర్వాత వారి ఆలోచన మారింది. భవిష్యత్తులో మనుషులతో పనిలేకుండా ఏఐనే సంక్లిష్టమైన కోడింగ్ రాస్తుందని, అప్పుడు తమ వ్యాపార నమూనా నిరుపయోగంగా మారుతుందని వారు గ్రహించారు.

ఈ క్రమంలోనే 2023 అక్టోబర్‌లో 'క్రియేట్' కంపెనీని పునర్‌వ్యవస్థీకరించారు. ఏడుగురు సభ్యుల బృందంలో సగం మందిని తొలగించి, ఫ్రీలాన్స్ డెవలపర్‌లతో ఒప్పందాలను రద్దు చేసుకున్నారు. "మేం మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టాం. అది చాలా కష్టమైన సమయం. మా బృందాన్ని, ఖాతాదారులను వదులుకోవాల్సి వచ్చింది" అని ధ్రువ్ అమిన్ తెలిపారు.

పాత కంపెనీని మూసివేసి, 'ఎనీథింగ్' పేరుతో కొత్త ఏఐ స్టార్టప్‌ను ప్రారంభించారు. కోడింగ్ నైపుణ్యాలు లేని వారు కూడా పూర్తిస్థాయి ఆన్‌లైన్ వ్యాపారాలను నిర్మించుకునే వేదికను వీరు రూపొందించారు. 2025 ఏప్రిల్‌లో ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన కేవలం రెండు వారాల్లోనే, కంపెనీ 2 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ స్టార్టప్ 11 మిలియన్ డాలర్ల నిధులను కూడా సమీకరించింది. ఏఐ కోడింగ్ రంగం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, తమ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి ఇప్పటికే కొందరు సాధారణ వినియోగదారులు మంచి యాప్‌లను రూపొందించారని అమిన్ వివరించారు.


More Telugu News