ఐబొమ్మ రవి కేసులో వెలుగులోకి వచ్చిన మరో కోణం!
- ఐబొమ్మ రవి కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం
- ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిన రవి
- బెంగళూరులో ఉన్న ప్రహ్లాద్‌ను పిలిపించి విచారించిన పోలీసులు
సినీ పరిశ్రమను కుదిపేసిన ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ కేసులో దర్యాప్తు రోజురోజుకూ మరింత లోతుగా వెళ్తోంది. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఈ విచారణలో వెలుగుచూస్తున్న విషయాలు దర్యాప్తు అధికారులను కూడా షాక్‌కు గురిచేస్తున్నాయి. తాజాగా ఈ కేసులో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. రవి కేవలం పైరసీ వరకే పరిమితం కాకుండా, ఇతరుల గుర్తింపు పత్రాలను దొంగిలించి భారీ అక్రమాలకు పాల్పడ్డాడన్న అనుమానాలు బలపడుతున్నాయి.
గతంలో పోలీసుల ముందు రవి ఇచ్చిన వాంగ్మూలంలో... ‘ప్రహ్లాద్ వెల్లేల’ అనే వ్యక్తి తన రూమ్‌మేట్ అని, ఐబొమ్మ నిర్వహణలో అతడికి కూడా పాత్ర ఉందని చెప్పాడు. అయితే విచారణ ముందుకు సాగిన కొద్దీ, రవి చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని తేలింది. వాస్తవానికి ప్రహ్లాద్‌కు ఏమాత్రం తెలియకుండానే అతడి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కీలక డాక్యుమెంట్లను రవి దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ దొంగిలించిన పత్రాలతో ప్రహ్లాద్ పేరుపై నకిలీ పత్రాలు సృష్టించి, బ్యాంక్ ఖాతాలు తెరవడం, ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడం, వెబ్‌సైట్ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో నిజాలను వెలికితీసేందుకు బెంగళూరులో నివసిస్తున్న ప్రహ్లాద్‌ను ప్రత్యేకంగా పిలిపించారు.
రవి ఎదుటే ప్రహ్లాద్‌ను కూర్చోబెట్టి పోలీసులు విచారణ చేపట్టగా, అతడు ఇచ్చిన స్టేట్‌మెంట్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. తనకు రవి ఎవరో తెలియదని, తామిద్దరం ఎప్పుడూ రూమ్‌మేట్స్‌గా ఉండలేదని ప్రహ్లాద్ స్పష్టంగా చెప్పాడు. తన పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వాడుతున్నారన్న విషయం తెలిసి తీవ్రంగా కలత చెందానని పోలీసులకు వివరించాడు. తన డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు కూడా చేశాడు.
ఈ పరిణామాలతో ఇమంది రవి చేసిన నేరాల జాబితా మరింత పెద్దదిగా మారుతోంది. పైరసీతో పాటు ఐడెంటిటీ థెఫ్ట్, ఫోర్జరీ, మోసాలు వంటి తీవ్రమైన ఆరోపణలు అతడిపై నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే తరహాలో ఇంకెంతమంది అమాయకుల డాక్యుమెంట్లు దుర్వినియోగం అయ్యాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.