Asaduddin Owaisi: బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిణామాలపై ఒవైసీ ఆందోళన

Owaisi Expresses Concern Over Violence Against Minorities in Bangladesh
  • మైనార్టీల భద్రత అత్యంత కీలకమన్న ఒవైసీ
  • భారత్- బంగ్లా మధ్య సానుకూల చర్చలకు కేంద్రం తీసుకుంటున్న చర్యలకు మద్దతిస్తామని వ్యాఖ్య
  • సెక్యులర్, జాతీయవాద పునాదులపై బంగ్లాదేశ్ ఏర్పడిందన్న ఒవైసీ

బంగ్లాదేశ్‌లో పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. హింసాత్మక ఘటనలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఈ పరిణామాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీల భద్రత, ప్రాంతీయ శాంతి నిలకడగా ఉండటం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో దీపు చంద్ర దాస్, అమృత్ మండల్ హత్యలు అత్యంత దురదృష్టకరమని పేర్కొన్న ఒవైసీ, ఈ ఘటనలను ఎంఐఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.


ఈ సందర్భంగా భారత్ – బంగ్లాదేశ్ మధ్య అర్థవంతమైన, సానుకూల చర్చలు కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఎంఐఎం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన వెల్లడించారు. బంగ్లాదేశ్ ఒక సెక్యులర్, జాతీయవాద పునాదులపై ఏర్పడిన దేశమని గుర్తు చేసిన ఒవైసీ, అక్కడ సుమారు రెండు కోట్ల మంది ముస్లిమేతర మైనారిటీలు నివసిస్తున్నారని చెప్పారు. వారి భద్రత, హక్కుల పరిరక్షణ ఆ దేశ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన బాధ్యతగా ఉండాలని సూచించారు.


భారత్ – బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా ఇరు దేశాల ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఒవైసీ తెలిపారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ మైనారిటీల భద్రతపై కట్టుబడి ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో శాంతి నెలకొనడం కేవలం ఆ దేశానికే కాకుండా, భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల భద్రతకు కూడా అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.


అయితే, పాకిస్థాన్ ఐఎస్ఐ, చైనాల పాత్ర ఈ ప్రాంతంలో ఆందోళన కలిగించే అంశంగా మారిందని ఒవైసీ హెచ్చరించారు. ఇలాంటి శక్తులు పరిస్థితులను అస్థిరపరచేందుకు ప్రయత్నించే అవకాశాలను విస్మరించకూడదన్నారు. అదే సమయంలో, భారత్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. దేశంలో శాంతి, సామరస్య వాతావరణం నిలవాలంటే ప్రతి ప్రభుత్వం మైనారిటీల రక్షణను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.

Asaduddin Owaisi
Bangladesh violence
Minority rights
India Bangladesh relations
Regional peace
Bangladesh election
Sheikh Hasina
ISI China
Indian Muslims

More Telugu News