హైదరాబాద్‌లో యుద్ధ విమానాల తయారీ.. టీఎల్‌ఎంఏఎల్‌ భారీ ప్లాన్!

  • భారత వాయుసేన కోసం 80 'సీ-130జే సూపర్‌ హెర్క్యులస్‌' విమానాల తయారీకి అవకాశం
  • ఐఏఎఫ్‌తో ఒప్పందం కుదిరితే హైదరాబాద్‌లోని 'టాటా లాక్‌హీడ్‌ మార్టిన్‌'లోనే పూర్తిస్థాయి విమానాల అసెంబ్లింగ్
  • ఇప్పటికే ఇక్కడ తయారైన 250 విమానాల తోక భాగాలు అమెరికాకు ఎగుమతి
భాగ్యనగరం త్వరలోనే భారీ రవాణా విమానాల తయారీ కేంద్రంగా (ఏరోస్పేస్ హబ్) మారబోతోంది. భారత వాయుసేన (ఐఏఎఫ్) తన అవసరాల కోసం 80 కొత్త సరుకు రవాణా విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో, అంతర్జాతీయ దిగ్గజం లాక్‌హీడ్‌ మార్టిన్‌ తన 'సీ-130జే సూపర్‌ హెర్క్యులస్‌' విమానాలను హైదరాబాద్‌లోనే తయారు చేసేందుకు ఆసక్తి చూపుతోంది.

ప్రస్తుతం ఈ విమానాలకు సంబంధించిన తోక భాగాలను హైదరాబాద్‌లోని 'టాటా లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఏరోస్ట్రక్చర్స్‌' యూనిట్‌లో తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు 250 యూనిట్లను అమెరికాకు పంపారు. వాయుసేనతో ఒప్పందం ఖరారైతే, అమెరికా వెలుపల ఈ విమానాలను పూర్తిస్థాయిలో తయారు చేసే ఏకైక కేంద్రంగా హైదరాబాద్‌ నిలుస్తుంది.

ఈ విమానం కేవలం సరుకు రవాణాకే కాకుండా యుద్ధ క్షేత్రంలోనూ కీలక పాత్ర పోషించగలదు. కొత్త వేరియంట్లలో ఆరు ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలతో కూడిన 'డిస్ట్రిబ్యూషన్ అపెర్చర్ సిస్టమ్' (డీఏఎస్) ఉంటుంది, ఇది పైలట్లకు రాత్రిపూట స్పష్టమైన దృశ్యాలను అందిస్తుంది. అలాగే క్షిపణి హెచ్చరిక వ్యవస్థ దీని అదనపు ఆకర్షణ. ఈ ఒప్పందం కుదిరితే హైదరాబాద్ నుంచి విదేశాలకు కూడా ఈ యుద్ధ విమానాలను ఎగుమతి చేసే అవకాశం ఉందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.


More Telugu News