Revanth Reddy: అసెంబ్లీ సమావేశాల ముంగిట సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

Revanth Reddy Reviews Irrigation Issues Ahead of Telangana Assembly Session
  • నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
  • నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్, ఆ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి
  • సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి స్థాయి వివరాలు పరిశీలించిన సీఎం  
తెలంగాణ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కీలక ముందస్తు సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్న నీటిపారుదల శాఖ అంశాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
రాష్ట్రానికి సంబంధించిన నదీజలాల వాటా, వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, ఏపీతో కొనసాగుతున్న జల వివాదాలు, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అనుసరించిన విధానాలు, అప్పట్లో తీసుకున్న నిర్ణయాలపై సీఎం విస్తృతంగా ఆరా తీశారు. గత పాలనలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తీసుకున్న చర్యలు, వాటి ప్రభావం, ప్రస్తుత స్థితిగతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
 
ప్రత్యేకంగా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం లోతైన సమీక్ష చేశారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదన దశ నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలు, బీఆర్‌ఎస్ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, పనుల పురోగతి, గత రెండేళ్లుగా కొనసాగుతున్న పరిస్థితి తదితర అంశాలపై సమగ్ర సమాచారం సేకరించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రాజెక్టు అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని కోణాల్లో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.
 
ఇదే సమయంలో సాగునీటి ప్రాజెక్టులపై గురువారం ప్రజా భవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వనున్న ప్రజెంటేషన్ అంశంపైనా సమీక్షలో చర్చ జరిగినట్లు సమాచారం. 
Revanth Reddy
Telangana Assembly
Telangana Politics
Irrigation Projects
Uttam Kumar Reddy
Palamuru Rangareddy Lift Irrigation Scheme
AP Water Disputes
Telangana Government
BRS Government
River Water Sharing

More Telugu News