Smriti Mandhana: స్మృతి మంధాన ఖాతాలో మరో రికార్డు... మిథాలీ రాజ్ తర్వాత రెండో స్థానం

Smriti Mandhana Achieves Milestone Second Indian Woman to 10000 International Runs
  • అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసిన స్మృతి మంధాన
  • ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు
  • మిథాలీ రాజ్ తర్వాత ఈ మైలురాయిని అందుకున్న భారత ప్లేయర్
  • శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 80 పరుగులతో చెలరేగిన స్మృతి
  • త్వరలో ప్రారంభం కానున్న డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీకి కెప్టెన్‌గా స్మృతి
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఈ ఘనతను భారత క్రీడాకారిణుల్లో మిథాలీ రాజ్ మాత్రమే సాధించింది.

ఆదివారం నాడు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో స్మృతి ఈ రికార్డును నెలకొల్పింది. మ్యాచ్‌కు ముందు ఈ రికార్డుకు 27 పరుగుల దూరంలో ఉన్న ఆమె, కేవలం 20 బంతుల్లోనే ఈ మైలురాయిని దాటింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మొత్తం 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేసింది.

ఈ ఘనతతో స్మృతి.. మిథాలీ రాజ్, న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ షార్లెట్ ఎడ్వర్డ్స్ సరసన చేరింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మిథాలీ రాజ్ (10,868) రికార్డును అధిగమించే అవకాశం స్మృతికి ఉంది. ఇటీవల శ్రీలంక సిరీస్‌లోనే 4,000 టీ20 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గానూ స్మృతి నిలిచింది.

2025లో వన్డేల్లో అత్యధిక పరుగులు (1,362) చేసిన క్రీడాకారిణిగా స్మృతి అగ్రస్థానంలో నిలిచింది. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా కూడా ఆమె రికార్డు సృష్టించింది. డిసెంబర్ 30న శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత, జనవరి 9 నుంచి ప్రారంభమయ్యే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు స్మృతి కెప్టెన్‌గా వ్యవహరించనుంది.
Smriti Mandhana
Indian Women Cricket
Mithali Raj
Women's Cricket
T20 Cricket
Royal Challengers Bangalore
WPL
Cricket Record
Suzie Bates
Charlotte Edwards

More Telugu News