Smriti Mandhana: అమ్మాయిల జోరు... వరుసగా నాలుగో టీ20లోనూ టీమిండియా విన్నర్

India Women secure fourth win in a row against Sri Lanka
  • శ్రీలంకతో నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం
  • 30 పరుగుల తేడాతో గెలుపొందిన భారత మహిళల జట్టు
  • అర్ధ సెంచరీలతో చెలరేగిన స్మృతి మంధాన, షఫాలీ వర్మ
  • రికార్డు స్కోరు సాధించిన టీమిండియా
  • ఛేదనలో కెప్టెన్ చమరి అటపట్టు పోరాడినా లంకకు తప్పని ఓటమి
శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్దేశించిన 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లంక జట్టు విఫలమైంది. ఐదు టీ20 మ్యాచ్ ల ఈ సిరీస్ ను ఇప్పటికే 3-0తో చేజిక్కించుకున్న భారత్... తాజా విజయంతో తన ఆధిక్యాన్ని 4-0కి పెంచుకుంది.

భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు దీటుగానే బదులిచ్చింది. కెప్టెన్ చమరి అటపట్టు (37 బంతుల్లో 52), హసిని పెరీరా (20 బంతుల్లో 33) మెరుపులతో మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే, కీలక దశలో వికెట్లు కోల్పోవడంతో లంక లక్ష్యానికి దూరమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, అరుంధతి రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (48 బంతుల్లో 80), షఫాలీ వర్మ (46 బంతుల్లో 79) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 162 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు భారీ స్కోరుకు బలమైన పునాది వేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ రిచా ఘోష్ (16 బంతుల్లో 40 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. దీంతో భారత జట్టు 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 221 పరుగులతో రికార్డు స్కోరు సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. 

ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ తిరువనంతపురంలోనే ఈ నెల 30న జరగనుంది.
Smriti Mandhana
India women cricket
Sri Lanka women cricket
Shafali Verma
Richa Ghosh
Chamari Athapaththu
T20 series
Indian women's cricket team
cricket match
sports

More Telugu News