Perni Nani: జంతుబలి సంస్కృతి ప్రారంభించింది టీడీపీ నేతలే: పేర్ని నాని

Perni Nani Accuses TDP of Starting Animal Sacrifice Culture
  • జగన్ ఫ్లెక్సీల వద్ద జంతుబలులు
  • వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
  • తీవ్రంగా స్పందించిన పేర్ని నాని
  • గతంలో బాలయ్య సినిమాలు, బాబు పుట్టినరోజుకు ఇలా చేయలేదా అని ప్రశ్న
రాష్ట్రంలో ఫ్లెక్సీల వద్ద జంతుబలులు ఇచ్చి రక్తతర్పణాలు చేసే సంస్కృతిని ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ అని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే, వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తూ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

 జగన్ పుట్టినరోజు సందర్భంగా రెండు వేర్వేరు ఘటనల్లో ఫ్లెక్సీల వద్ద జంతుబలి ఇచ్చారనే ఆరోపణలతో వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయడంపై పేర్ని నాని ఆదివారం స్పందించారు. "గతంలో బాలకృష్ణ సినిమా విడుదలైనప్పుడు, చంద్రబాబు పుట్టినరోజున టీడీపీ కార్యకర్తలు జంతుబలులు ఇవ్వలేదా? అప్పుడు ఈ చట్టాలు గుర్తుకు రాలేదా?" అని ఆయన ప్రశ్నించారు. కేవలం ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేయడం రాజకీయ కక్ష సాధింపు కాదా అని నిలదీశారు.

వైసీపీ హింసను ప్రేరేపిస్తోందని, భయాందోళనలు సృష్టిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను నాని ఖండించారు. అరెస్టయిన కార్యకర్తలను నేరస్తుల్లా రోడ్లపై ఊరేగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

"జంతుబలి ఇవ్వడం నిజంగా చట్టవిరుద్ధమైతే, రాష్ట్రవ్యాప్తంగా గ్రామ దేవతల జాతరల్లో జరిగే బలులను కూడా ప్రభుత్వం నిషేధించగలదా? లేక ఈ చట్టం కేవలం వైసీపీకి మాత్రమే వర్తిస్తుందా?" అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. తూర్పు గోదావరి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఇటీవల జరిగిన ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు మొత్తం 14 మంది వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Perni Nani
TDP
YCP
animal sacrifice
Andhra Pradesh politics
Chandrababu Naidu
flex banners
arrests
political revenge
Jagan birthday

More Telugu News