Chandrababu Naidu: సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says Ram Rajya is Benchmark for Good Governance
  • అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
  • యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాలనపై ప్రశంసలు
  • 2047 వికసిత్ భారత్ లక్ష్యంలో యూపీ, బీహార్ కూడా కీలకమన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం నాడు అయోధ్యలో పర్యటించారు. శ్రీరామ జన్మభూమి క్షేత్రాన్ని సందర్శించి, బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్‌మార్క్ అని అన్నారు. మంచి పరిపాలనను ఎప్పుడూ రామరాజ్యంతోనే పోలుస్తామని పేర్కొన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, అయోధ్యలో నిర్మించిన రామమందిరం దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్ల వివాదాల అనంతరం ఆలయం నిర్మితం కావడంతో దేశ ప్రజల కల సాకారమైందన్నారు. ఆలయ నిర్మాణంతో పాటు, ఉత్తరప్రదేశ్‌లో మంచి పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అభినందించారు.

దేశంలోని ఇతర దేవాలయాలకు అయోధ్య రామాలయం ఒక మార్గదర్శిగా నిలవాలని ఆకాంక్షించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు కూడా కీలక పాత్ర పోషించాలన్నారు. సాంకేతికంగా దూసుకెళుతున్న భారత్‌ను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.

తన పర్యటన అనంతరం చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘శ్రీరాముడు పాటించిన విలువలు కాలాతీతమైనవి, సుపరిపాలనకు నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తాయి. అయోధ్యలో శ్రీరామ దర్శనం నాకు నూతన శక్తిని ఇచ్చింది’’ అని తన పోస్టులో పేర్కొన్నారు.


Chandrababu Naidu
Andhra Pradesh
Ayodhya
Ram Mandir
Yogi Adityanath
Ram Rajya
Good Governance
Vikshit Bharat
Uttar Pradesh
Temple

More Telugu News