Elon Musk: కెనడా వైద్య వ్యవస్థపై ఎలాన్ మస్క్ ఫైర్... భారత సంతతి వ్యక్తి మృతిపై ఘాటు వ్యాఖ్యలు

Elon Musk Fires at Canada Healthcare Over Indian Origin Mans Death
  • కెనడా ఆసుపత్రిలో 8 గంటలు వేచి చూసి భారత సంతతి వ్యక్తి మృతి
  • ప్రభుత్వ వైద్యంపై ఎలాన్ మస్క్ ఘాటు విమర్శలు
  • ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే తన భర్త చనిపోయారన్న భార్య
  • ఈ ఘటనకు కెనడా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న భారత్
  • విషయంపై దర్యాప్తునకు ఆదేశించిన కెనడా అధికారులు
కెనడాలోని ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై టెస్లా సీఈవో, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. భారత సంతతికి చెందిన 44 ఏళ్ల ప్రశాంత్ శ్రీకుమార్ అనే వ్యక్తి, ఆసుపత్రిలో ఎమర్జెన్సీ చికిత్స కోసం ఎనిమిది గంటలకు పైగా వేచి చూసి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆయన స్పందించారు. ప్రభుత్వాలు అందించే వైద్య సేవలు ఎంత నాసిరకంగా ఉంటాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

వివరాల్లోకి వెళితే, కెనడాలోని ఎడ్మంటన్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ శ్రీకుమార్‌కు డిసెంబర్ 22న తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే గ్రే నన్స్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మధ్యాహ్నం 12:20 గంటలకు ఆయన్ను చేర్పించారు. సిబ్బంది ఈసీజీ తీసి, నొప్పి తగ్గడానికి టైలనాల్ మాత్రలు ఇచ్చి, చికిత్స కోసం వేచి ఉండమని చెప్పారు. సుమారు 8 గంటల పాటు నొప్పితో విలవిల్లాడిన ఆయన, రాత్రి 8 గంటల తర్వాత చికిత్స కోసం సిబ్బంది పిలవగానే కుప్పకూలిపోయారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై ఎలాన్ మస్క్ తన 'ఎక్స్' ఖాతాలో స్పందిస్తూ, "ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తే, అది డిపార్ట్‌మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్ (డీఎంవీ) ఆఫీసులో లభించే సేవల మాదిరిగానే ఉంటుంది" అని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వ్యవస్థల్లో ఉండే జాప్యం, నిర్లక్ష్యాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

మరోవైపు, ప్రశాంత్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. "సకాలంలో వైద్యం అందించకుండా నా భర్తను ఆసుపత్రి సిబ్బందే చంపేశారు. మేము కెనడా పౌరులం, ఎంతో పన్ను కట్టాం. కానీ ఒక్కసారి వైద్య సహాయం అవసరమైతే, అది కూడా అందించలేదు" అని ప్రశాంత్ భార్య నిహారిక ఆవేదన వ్యక్తం చేశారు. "నాన్నా, నేను నొప్పి భరించలేకపోతున్నాను" అని తన కుమారుడు చివరిసారిగా చెప్పిన మాటలను ప్రశాంత్ తండ్రి కుమార్ శ్రీకుమార్ గుర్తుచేసుకున్నారు.

ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. ప్రశాంత్ శ్రీకుమార్ భారత సంతతికి చెందినప్పటికీ, కెనడా పౌరుడని, కాబట్టి ఈ మృతికి కెనడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై అల్బెర్టా చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. ఆసుపత్రిని నడుపుతున్న 'కొవెనెంట్ హెల్త్' సంస్థ కూడా అంతర్గత విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది.
Elon Musk
Canada healthcare
Prashanth Sreekumar
Canada health system
Healthcare wait times
Indian origin
Alberta
Covenant Health
Medical negligence
Government healthcare

More Telugu News