Prakash Raj: కాలిన వాసన ఎక్కడ వస్తోందో మీ మాటల ద్వారానే తెలిసిపోతోంది: ప్రకాశ్ రాజ్ కు విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్

Prakash Raj vs Vishnuvardhan Reddy Verbal Clash
  • ప్రకాశ్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య ముదిరిన సోషల్ మీడియా వార్
  • ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలతో మొదలైన వివాదం
  • ప్రకాశ్ రాజ్‌ను 'అర్బన్ నక్సల్' అంటూ విమర్శించిన బీజేపీ నేత
తనపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చేసిన సుదీర్ఘ విమర్శలకు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నిన్న ఘాటుగా స్పందించడం తెలిసిందే. "వెంటనే రియాక్ట్ అయ్యారు.. కాలిందా???" అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై విష్ణువర్ధన్ రెడ్డి ఇవాళ కౌంటర్ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్‌ను 'అర్బన్ నక్సల్' అని సంబోధిస్తూ, ఆయన ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. "కాలిన వాసన ఎక్కడ వస్తుందో మీ మాటల ద్వారానే తెలిసిపోతోంది అర్బన్ నక్సల్ రాజ్ గారూ" అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.

ఈ మేరకు విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. మావోయిస్టులు ఎంతో మంది అమాయక గిరిజనులను, పోలీసులను, రాజకీయ నేతలను చంపారని, వారి హత్యలను ప్రకాశ్ రాజ్ ఎప్పుడైనా ప్రశ్నించారా అని నిలదీశారు. అడవి బిడ్డలను ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు హతమారుస్తున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం నక్సల్స్ లొంగిపోయేందుకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయమని పిలుపునిస్తున్నా.. ఆ విషయాలు తెలియవన్నట్లు ఎందుకు నటిస్తున్నారని ప్రకాశ్ రాజ్ పై మండిపడ్డారు. మీరు కూడా బెంగళూరులో ఎన్నికల్లో పోటీ చేశారు కదా గుర్తుచేశారు.

ఆరెస్సెస్ గురించి ప్రకాశ్ రాజ్ ఎందుకు అనుచితంగా మాట్లాడుతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు కూడా ఆరెస్సెస్ గొప్పతనాన్ని కొనియాడుతున్నారని తెలిపారు. "వెలిసిపోయిన ఎర్ర పార్టీల నీడకు వెళ్లి, నాలుగు అబద్దాలు చెప్పి ఉనికిని కాపాడుకోవడానికే మీ తాపత్రయం. మేం స్పందించి వాస్తవాలు చెబితే మీకు కాలిందా సోదరా?" అని వ్యాఖ్యానించారు. నమ్మిందే నిజమని భావించకుండా, వాస్తవ ప్రపంచంలోకి వచ్చి విషయాలు పరిశీలించి మాట్లాడితే గౌరవం దక్కుతుందని ప్రకాశ్ రాజ్‌కు హితవు పలికారు. అవసరమైతే ఈ విషయాలన్నీ కన్నడంలో కూడా రాస్తానని విష్ణు పేర్కొన్నారు.
Prakash Raj
Vishnuvardhan Reddy
BJP
Urban Naxal
RSS
Maoists
Andhra Pradesh Politics
Counter Attack
Political Criticism
Social Activism

More Telugu News