BJP leader: అత్యాచారం చేసి బెదిరింపులు.. మధ్య ప్రదేశ్‌ లో బీజేపీ నేత ఆకృత్యం.. వీడియో ఇదిగో!

Madhya Pradesh BJP Leader Ashok Singh Accused of Rape and Blackmail
  • నీ దిక్కున్న చోట చెప్పుకోమంటూ సవాల్
  • తనను ఎవరూ ఏం చేయలేరని ధీమా
  • కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడంటున్న మహిళ
  • కన్నీళ్లతో న్యాయం కోసం బాధితురాలి ఆవేదన
అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, బాధితురాలిని బెదిరించాడో నాయకుడు. ఫిర్యాదు చేసినా తనను ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. అత్యాచారం చేస్తూ వీడియోలు తీసి నెలల తరబడి వేధింపులకు గురిచేశాడంటూ బాధితురాలు కన్నీళ్లతో న్యాయం చేయాలని వేడుకుంటోంది. ఈ విషయంపై బాధితురాలు నిలదీయగా.. తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ నిందితుడు విర్రవీగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

సత్నా జిల్లా రాంపూర్ బాఘేలన్ నగర్ పరిషత్ కౌన్సిలర్ భర్త అశోక్ సింగ్ అధికార బీజేపీకి చెందిన స్థానిక నాయకుడు. ఆరు నెలల క్రితం అశోక్ సింగ్ ఓ మహిళ ఇంట్లోకి చొరబడి, కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను తన మొబైల్‌లో రికార్డు చేశాడు. అత్యాచారం చేసిన విషయాన్ని బయటకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.

ఆమెతో పాటు ఆమె కుటుంబం మొత్తాన్నీ అంతమొందిస్తానని హెచ్చరించాడు. భయంతో బాధితురాలు మౌనంగా ఉండడాన్ని అలుసుగా తీసుకున్న అశోక్ సింగ్.. ఆ తర్వాత కూడా వేధింపులకు గురిచేశాడు. ఈ నెల 20న మరోసారి బాధితురాలిని వేధిస్తూ.. తాను చెప్పినట్లు వినకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో అశోక్ సింగ్ ను బాధితురాలు నిలదీసింది. వీడియో రికార్డు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగా.. అశోక్ సింగ్ అహంకారంతో మాట్లాడాడు. ఎవరికి ఫిర్యాదు చేసినా తనకేమీ కాదని ధీమా వ్యక్తం చేశాడు. తనను అడిగే వారు లేరని విర్రవీగడం వీడియోలో కనిపిస్తోంది.

‘నీ ఇష్టం వచ్చిన చోట ఫిర్యాదు చేసుకో.. పోలీసులే కాదు ఎవరూ నన్నేమీ చేయలేరు. నాకేం కాదు’ అంటూ బాధితురాలిని హేళన చేశాడు. బాధిత మహిళ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అశోక్ సింగ్ నుంచి తనను కాపాడాలని, అతడికి తగిన శిక్ష పడాలని విజ్ఞప్తి చేసింది. ఈ వీడియో చూసిన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశోక్ సింగ్‌కు నేరచరిత్ర ఉందని, అయినా అధికార పార్టీ అండతో అతడు యథేచ్ఛగా తిరుగుతున్నాడని ఆరోపించింది. ఐదు రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణాపాయం ఉందని.. తమకు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యతని ఆమె హెచ్చరించింది.

కేసు నమోదు చేసిన పోలీసులు..
బాధితురాలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు సీరియస్‌ గా స్పందించారు. నిందితుడు అశోక్ సింగ్ పై కేసు నమోదు చేశారు. దీనిపై సత్నా ఎస్పీ హంసరాజ్ సింగ్ స్పందిస్తూ.. డిప్యూటీ ఎస్పీ మనోజ్ త్రివేది ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. నిందితుడిని న్యాయస్థానం ముందు నిలబెడతామని, చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు.
BJP leader
rape
sexual assault
threats
Ashok Singh
Madhya Pradesh
Satna
police investigation
crime
viral video

More Telugu News