K Narayana: తిరుమల భూములు స్టార్ హోటళ్లకు కేటాయింపు భావ్యం కాదు: సీపీఐ నారాయణ

K Narayana Opposes Tirumala Land Allotment to Oberoi Hotels
  • అలిపిరిలో ఒబెరాయ్ స్టార్ హోటల్‌కు జరిగిన భూకేటాయింపులు రద్దు చేయాలన్న సీపీఐ నారాయణ
  • పవిత్రమైన ప్రాంతంలో ప్రైవేటు కార్పోరేట్ సంస్థకు భూముల అప్పగింత అపచారం కాదా అని ప్రశ్నించిన నారాయణ
  • ఢిల్లీకి చెందిన కార్పొరేట్‌ పెద్దలు, ప్రధాని, కేంద్ర హోం మంత్రి జోక్యం ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేసిన నారాయణ
అలిపిరి ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన భూములను ఒబెరాయ్‌ స్టార్‌ హోటల్‌కు కేటాయించడం పూర్తిగా తప్పని, ఆ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఐ జాతీయ కంట్రోల్‌ మిషన్‌ చైర్మన్‌ కె. నారాయణ డిమాండ్‌ చేశారు. శనివారం హోటల్‌ నిర్మాణానికి కేటాయించిన భూములను ఆయన స్వయంగా పరిశీలించారు.
 
ఈ సందర్భంగా కె. నారాయణ మాట్లాడుతూ.. టీటీడీకి చెందిన పవిత్ర భూముల్లో స్టార్‌ హోటల్‌ నిర్మాణం ఎలా చేస్తారని ప్రశ్నించారు. స్టార్‌ హోటళ్లలో సాధారణంగా పబ్బులు, బార్లు, మాంసాహారం ఉంటాయని, ఇలాంటి వాటిని దేవుడి సన్నిధిలో ఎలా అనుమతిస్తారని వ్యాఖ్యానించారు. అలిపిరి వంటి అత్యంత పవిత్రమైన ప్రాంతంలో ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థకు భూములను అప్పగించడం ఘోర అపచారం కాదా అని ప్రశ్నించారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం నేరుగా భూములు ఇవ్వలేకపోయి, టూరిజం, అటవీ శాఖలకు కేటాయించినట్లు చూపించి, అనంతరం ఒబెరాయ్‌ హోటల్‌కు 25 ఎకరాల భూమిని కేటాయించిందని ఆరోపించారు. ఈ భూ కేటాయింపులో ఢిల్లీకి చెందిన కార్పొరేట్‌ పెద్దలు, ప్రధాని, కేంద్ర హోం మంత్రి వరకు జోక్యం చేసుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రాముఖ్యత బాగా తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజంగా దేవుడిపై భక్తి కలిగి ఉంటే ఇలాంటి స్థలాన్ని ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు.
 
గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే తరహా ప్రయత్నం చేసిందని, అప్పట్లో ఉద్యోగులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారని కె. నారాయణ గుర్తు చేశారు. ఈసారి కూడా ప్రజా ఉద్యమాలతో ఈ భూ కేటాయింపును అడ్డుకుంటామని హెచ్చరించారు.
 
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ. రామానాయుడు, పార్టీ నేతలు పి. మురళి, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
K Narayana
Tirumala
TTD
Oberoi Hotels
Andhra Pradesh
Land Allocation
CPI
Alipiri
Tourism
Chandrababu Naidu

More Telugu News