Rishabh Pant: టీమిండియా వన్డే జట్టులో భారీ మార్పులు: రిషభ్ పంత్‌పై వేటు.. కిషన్‌కు పిలుపు?

Rishabh Pant Out Ishan Kishan In for India ODI Series
  • న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు పంత్ దూరం!
  • దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న ఇషాన్ కిషన్‌కు దక్కనున్న అవకాశం
  • గాయం నుంచి కోలుకుని మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్న శుభ్‌మన్ గిల్
భారత వన్డే జట్టులో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న మూడు వన్డేల సిరీస్ నుంచి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను తప్పించనున్నట్లు తెలుస్తోంది. 2025–26 సీజన్‌లో టీమ్ ఇండియా ఆడబోయే ఆఖరి హోమ్ సిరీస్ కోసం ఫామ్, జట్టు సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ఈ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

రిషబ్ పంత్ స్థానంలో జార్ఖండ్ డైనమో ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోవాలని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది. రెండేళ్లుగా వన్డేలకు దూరంగా ఉన్న కిషన్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేయడమే కాకుండా, విజయ్ హజారే ట్రోఫీలో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ అద్భుత ప్రదర్శనే అతడిని తిరిగి వన్డే జట్టులోకి చేర్చేలా కనిపిస్తోంది.

మెడ గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి కెప్టెన్‌గా తిరిగి రానున్నాడు. గిల్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ నాయకత్వంలో భారత్ 2–1తో దక్షిణాఫ్రికాపై సిరీస్ నెగ్గింది. ఇప్పుడు గిల్ రావడంతో టాప్ ఆర్డర్ మరింత బలోపేతం కానుంది. మరోవైపు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ శిక్షణ మొదలుపెట్టినప్పటికీ, అతడికి ఇంకా పూర్తి క్లియరెన్స్ లభించలేదు.

రిషభ్ పంత్ చివరిసారిగా 2024 ఆగస్టులో శ్రీలంకపై వన్డే ఆడాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో జట్టులో ఉన్నప్పటికీ ఆడే అవకాశం రాలేదు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహిస్తున్న పంత్ అక్కడ కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు (తొలి రెండు మ్యాచుల్లో 5, 70 పరుగులు). దీంతో ప్రస్తుతానికి పంత్‌ను పక్కనపెట్టి, జోరుమీదున్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.
Rishabh Pant
India vs New Zealand
Ishan Kishan
Shubman Gill
Vijay Hazare Trophy
Syed Mushtaq Ali Trophy
Indian Cricket Team
One Day International
KL Rahul
Shreyas Iyer

More Telugu News