Vladimir Putin: శాంతి చర్చలకు మొగ్గు చూపకపోతే సైనిక చర్యే.. ఉక్రెయిన్‌కు పుతిన్ హెచ్చరిక

Vladimir Putin warns Ukraine of military action if peace talks fail
  • లక్ష్యాల సాధన కోసం ఎంతటికైనా తెగిస్తామన్న రష్యా అధ్యక్షుడు
  • ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు
  • 500 డ్రోన్లు, 40 క్షిపణులతో విరుచుకుపడిన సైన్యం
  • ఫ్లోరిడాలో డొనాల్డ్ ట్రంప్‌తో నేడు భేటీ కానున్న జెలెన్‌స్కీ
  • ఉక్రెయిన్‌కు భారీ ఆర్థిక సాయం ప్రకటించిన కెనడా
ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కీవ్ (ఉక్రెయిన్) పాలకులకు శాంతియుత మార్గంలో వివాదాన్ని పరిష్కరించుకోవడం ఇష్టం లేదని విమర్శించారు. ఒకవేళ దౌత్యం విఫలమైతే ‘ప్రత్యేక సైనిక చర్య’ తప్పదని, లక్ష్యాలన్నింటినీ బలప్రయోగం ద్వారానే సాధిస్తామని హెచ్చరించారు.  

పుతిన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే రష్యా దళాలు ఉక్రెయిన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో దాడులకు తెగబడ్డాయి. రాత్రంతా జరిగిన ఈ దాడుల్లో సుమారు 500 డ్రోన్లు, 40 క్షిపణులను రష్యా ప్రయోగించింది. ఈ భీకర దాడిలో ఒకరు మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. రష్యాకు యుద్ధం ఆపే ఉద్దేశం లేదనడానికి ఈ 10 గంటల విధ్వంసమే నిదర్శనమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలికే మార్గాలను వెతకడానికి జెలెన్‌స్కీ నేడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఫ్లోరిడాలో జరగనున్న ఈ సమావేశంలో భద్రతా హామీలు, వివాదాస్పద ప్రాంతాలపై చర్చించనున్నారు. ట్రంప్‌తో భేటీకి ముందు కెనడా చేరుకున్న జెలెన్‌స్కీ శాంతి స్థాపన కోసం తాము చేస్తున్న ప్రయత్నాలకు రష్యా అడ్డుతగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడులను కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులను ఆయన ‘అమానవీయమైనవి’గా అభివర్ణించారు. శాంతి స్థాపన జరగాలంటే రష్యా సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం కెనడా ప్రభుత్వం 2.5 బిలియన్ కెనడియన్ డాలర్ల (సుమారు 1.82 బిలియన్ యూఎస్ డాలర్లు) భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
Vladimir Putin
Russia Ukraine war
Ukraine conflict
Zelensky
Donald Trump
Mark Carney
Peace talks
Military action
Russian attacks
US aid to Ukraine

More Telugu News