Prabhas: సీనియర్ల తర్వాతే మేము.. సంక్రాంతి సినిమాలన్నీ హిట్టవ్వాలి: ప్రభాస్

Prabhas Comments on Sankranti Movies and Seniors
  • హైదరాబాదులో రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
  • మూడేళ్ల తర్వాత అభిమానులతో మాట్లాడిన ప్రభాస్
  • సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ కావాలన్న పాన్ ఇండియా స్టార్
  • సీనియర్ నటుల తర్వాతే తామంటూ ప్రభాస్ వినమ్రత
  • నిర్మాత విశ్వప్రసాద్‌ను రియల్ హీరోగా అభివర్ణన
  • భావోద్వేగానికి గురైన దర్శకుడు మారుతిని ఓదార్చిన వైనం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది రాజాసాబ్' చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభాస్, దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మైక్ పట్టుకుని తన అభిమానులను "డార్లింగ్స్, ఎలా ఉన్నారు?" అంటూ పలకరించారు. ఆయన ప్రసంగం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, 2026 సంక్రాంతికి విడుదల కానున్న అన్ని చిత్రాలు భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. "సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అన్నీవిజయవంతం అవ్వాలని నేను మరోసారి కోరుకుంటున్నాను. మాది కూడా హిట్టయిపోతే హ్యాపీ" అని అన్నారు. 

"ఒక విషయం చాలా ముఖ్యం, సీనియర్స్ అంటే సీనియర్సే. వాళ్ల నుంచి ఎంతో నేర్చుకుంటాం. సీనియర్స్ తర్వాతే మేము " అని వినమ్రంగా చెప్పారు. తమ తరం నటుల విజయాల వెనుక సీనియర్ల నుంచి నేర్చుకున్న అనుభవమే కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌పై ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించారు. "ఈ సినిమా నిర్మాత విశ్వప్రసాద్ గారు కాక ఇంకెవరైనా అయితే ఈ సినిమా పూర్తయ్యేది కాదు. ఆయనే ఈ సినిమాకు అసలైన హీరో" అని కొనియాడారు. ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటూ, "చిన్ననాటి నుంచి ఏం తిని పెరిగారు? మీకు అంత ధైర్యం ఎలా వచ్చింది? ఆ తినేదేదో మాకు కూడా చెప్పొచ్చు కదా" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

ఇదే వేదికపై దర్శకుడు మారుతి తన ప్రసంగం మధ్యలో భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. ఇది గమనించిన ప్రభాస్ వెంటనే స్టేజ్ పైకి వెళ్లి, ఆయన్ను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఈ సంఘటన అక్కడున్న వారిని కదిలించింది. ఇక సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుతూ, "రేపు ట్రైలర్ చూడండి. విశ్వప్రసాద్ గారి బడ్జెట్, ఆయన అభిరుచి అన్నీ అందులో కనిపిస్తాయి" అని ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు.

చివరగా, "సో, లవ్ యు డార్లింగ్! ఈరోజు కొంచెం ఎక్కువ మాట్లాడానా? వస్తుంది, అప్పుడప్పుడు అలా వస్తుంటుంది. ఓకే డార్లింగ్!" అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ప్రభాస్ సుదీర్ఘంగా మాట్లాడటంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 'ది రాజాసాబ్' చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 
Prabhas
The Raja Saab
Maruthi
Sankranti movies
Telugu cinema
TG Vishwa Prasad
Pan India star
Tollywood
Movie release
Film trailer

More Telugu News