Duvvada Srinivas: వాళ్లిద్దరి నుంచి నాకు ప్రాణహాని ఉంది: ఎస్పీకి ఫిర్యాదు చేసిన దువ్వాడ శ్రీనివాస్

Duvvada Srinivas Alleges Death Threats Files Complaint Against Dharmana Brothers
  • ధర్మాన సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్న దువ్వాడ శ్రీనివాస్
  • శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వరరెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు
  • తన చావుకు మాజీ మంత్రులే బాధ్యులంటూ సంచలన ఆరోపణలు
  • ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదులో వెల్లడి
  • తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరిన మాజీ ఎమ్మెల్సీ
మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఏమైనా జరిగితే అందుకు ధర్మాన సోదరులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ శనివారం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

దివ్వెల మాధురితో కలిసి జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన దువ్వాడ శ్రీనివాస్, ఎస్పీని నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. ఇటీవల తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంతో పాటు వారి అంతర్గత విషయాలను బయటపెడుతున్నందుకే తనపై కక్షగట్టారని ఆరోపించారు.

గత కొద్ది రోజులుగా ధర్మాన సోదరులను లక్ష్యంగా చేసుకుని దువ్వాడ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తనపై హత్యాప్రయత్నం జరుగుతోందని, భౌతికంగా దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. తనకు తగిన రక్షణ కల్పించి, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.
Duvvada Srinivas
Dharmana Prasada Rao
Dharmana Krishnadas
Srikakulam
Andhra Pradesh Politics
Threats
Police Complaint
Political Rivalry
YSRCP
Divvela Madhuri

More Telugu News