ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకు ఆనందంగా ఉంటుంది: సీఎం చంద్రబాబు

  • గండిపేటలో ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ వార్షికోత్సవ కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు
  • గండిపేటతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న వైనం
  • పేద, అనాథ పిల్లలకు అండగా నిలిచేందుకే ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు అని వెల్లడి
  • సంస్థల నిర్వహణ ఘనత నారా భువనేశ్వరిదేనన్న ముఖ్యమంత్రి
పేద, అనాథ పిల్లలకు ఉన్నత విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే గొప్ప సంకల్పంతోనే ఎన్టీఆర్ ట్రస్ట్‌ను స్థాపించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సమాజ సేవలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థలు నేడు ఎంతో మంది విద్యార్థులకు అండగా నిలుస్తున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌ గండిపేటలోని ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా గండిపేటతో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. "గండిపేటకు వచ్చినప్పుడల్లా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఒకప్పుడు ఇదే ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఉండేది. ఎంతో మంది రాజకీయ నాయకులకు ఇక్కడ శిక్షణ ఇచ్చాం. ఇప్పుడు అదే స్థలంలో వివిధ కారణాల వల్ల అనాథలుగా మారిన పిల్లలకు విద్యను అందిస్తుండటం సంతృప్తినిస్తోంది. సమాజంలో ఎవరూ అనాథలు కాకూడదనే ఉద్దేశంతో, వారికి పెద్ద దిక్కుగా నిలవాలనే లక్ష్యంతో అప్పుడు నాటిన చిన్న మొక్క ఇప్పుడు మహావృక్షంగా ఎదిగింది" అని ఆయన పేర్కొన్నారు.

ఎన్టీఆర్ విద్యా సంస్థలను ఉన్నత ప్రమాణాలతో, సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఘనత పూర్తిగా నారా భువనేశ్వరికే చెందుతుందని చంద్రబాబు ప్రశంసించారు. ఆమె పర్యవేక్షణ వల్లే సంస్థలు ఇంతగా అభివృద్ధి చెందాయని కొనియాడారు. 

ఈ సంస్థల నుంచి చదువుకున్న నలుగురు విద్యార్థులు గ్రూప్-1 పోస్టులకు ఎంపికయ్యారని, 29 మంది ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు సాధించారని తెలపడం గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం వివిధ కేంద్రాల్లో 1,641 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, చిన్న పాఠశాలగా మొదలైన ప్రస్థానం నేడు ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాల స్థాయికి విస్తరించిందని వివరించారు.

గతంలో తన చొరవ వల్లే హైదరాబాద్ ఉన్నత విద్యకు, ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చంద్రబాబు అన్నారు. హెరిటేజ్ సంస్థను స్థాపించినప్పుడు దాని బాధ్యతలు చేపట్టేందుకు భువనేశ్వరి మొదట అంగీకరించలేదని, కానీ ఆ తర్వాత ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని గుర్తుచేశారు. 

"గతంలో హైటెక్ సిటీ నిర్మించి ఐటీ రంగాన్ని ప్రోత్సహించాం. అదే స్ఫూర్తితో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను నెక్స్ట్ జెనరేషన్ టెక్నాలజీలకు చిరునామాగా మార్చబోతున్నాం. డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ల తయారీ, డ్రోన్, స్పేస్ టెక్నాలజీలకు ఏపీని హబ్‌గా తీర్చిదిద్దుతాం" అని తన భవిష్యత్ ప్రణాళికను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


More Telugu News