Atluri Venkaiah: బాపట్ల జిల్లాలో విషాదం... కొడుకు విద్యుత్ షాక్ తో మృతి... రైలుకింద పడి తండ్రి ఆత్మహత్య

Bapatla tragedy Father commits suicide after son dies of electric shock
  • ఎరువుల బస్తాలు దించుతుండగా విద్యుత్ తీగలు తగిలి యువకుడి మరణం
  • అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన
  • కొడుకు మరణంపై ఫిర్యాదు చేసిన తండ్రి... ఆ తర్వాత రైలు కిందపడి ఆత్మహత్య
బాపట్ల జిల్లా వేమూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో కళ్లెదుటే కుమారుడు ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేకపోయిన ఓ తండ్రి, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా అందరినీ కలిచివేసింది.

వివరాల్లోకి వెళితే.. వేమూరుకు చెందిన అట్లూరి సునీల్ (22) అనే యువకుడు బేతేలుపురం వద్ద పొలంలో ట్రాక్టర్ నుంచి ఎరువుల బస్తాలు దించుతున్నాడు. ఆ సమయంలో ప్రమాదకరంగా కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు అతడి చేతికి తగలడంతో తీవ్రమైన షాక్‌కు గురయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెనాలి-వేమూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కుమారుడి మృతిపై తండ్రి అట్లూరి వెంకయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే, కుమారుడి అకాల మరణంతో వెంకయ్య తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. కొడుకు ఇక లేడన్న వేదన భరించలేక, సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి తెనాలి-రేపల్లె రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. గంటల వ్యవధిలోనే తండ్రీకొడుకులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Atluri Venkaiah
Bapatla district
Vemuru
suicide
electrocution
father son death
train accident
Andhra Pradesh news
negligence
farmers death

More Telugu News