అద్వానీ పాదాల వద్ద కూర్చున్న వ్యక్తి ప్రధాని అయ్యారు: ఆరెస్సెస్‌పై దిగ్విజయ్ ప్రశంస

  • అద్వానీ కుర్చీలో కూర్చుని ఉండగా, పాదాల వద్ద మోదీ కూర్చున్న ఫొటోను పంచుకున్న దిగ్విజయ్
  • ఇదీ ఆ సంస్థ గొప్పతనమంటూ ఆరెస్సెస్‌పై ప్రశంసలు
  • ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీలను ట్యాగ్ చేసిన దిగ్విజయ్
ఆరెస్సెస్‌లో సాధారణ కార్యకర్తగా పనిచేసి, అద్వానీ వంటి నాయకుడి పాదాల వద్ద నేలపై కూర్చున్న నరేంద్ర మోదీ ఆ తర్వాత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఎదిగారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. గుజరాత్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అద్వానీ కుర్చీలో కూర్చుని ఉండగా, నరేంద్ర మోదీ ఆయన కాళ్ల వద్ద కూర్చున్నప్పటి ఒకప్పటి ఫొటోను ఆయన పంచుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తుండటం కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం తెప్పిస్తోంది. ఇప్పుడు థరూర్ బాటలో దిగ్విజయ్ సింగ్ బీజేపీ, ఆరెస్సెస్‌పై ప్రశంసలు కురిపించడం గమనార్హం.

"నేను ఇటీవల ఒక ఫొటోను చూశాను. అది చాలా ఆసక్తికరంగా ఉంది. ఆరెస్సెస్‌లో సామాన్య కార్యకర్తలా, నాయకుల పాదాల వద్ద నేలపై కూర్చున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా ఎలా ఎదిగారో చూడండి. ఇది ఆ సంస్థ శక్తి" అని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ట్యాగ్ చేశారు.


More Telugu News