'పుష్ప 2' తొక్కిసలాట కేసు... అల్లు అర్జున్‌తో సహా 23 మందిపై ఛార్జ్‌షీట్

  • 'పుష్ప 2' తొక్కిసలాట కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు
  • ఏ11గా అల్లు అర్జున్, ఏ1గా థియేటర్ యాజమాన్యం
  • మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు
  • థియేటర్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని నిర్ధారణ
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప 2' సినిమా ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్‌తో సహా మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తమ నివేదికలో నిర్ధారించారు.

ఛార్జ్‌షీట్‌లో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని ఏ1గా, హీరో అల్లు అర్జున్‌ను ఏ11గా చేర్చారు. వీరితో పాటు ముగ్గురు మేనేజర్లు, ఎనిమిది మంది బౌన్సర్ల పేర్లను కూడా నిందితుల జాబితాలో పొందుపరిచారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను కూడా ఛార్జ్‌షీట్‌లో చేర్చారు.

గతేడాది డిసెంబర్ 3న 'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా ఈ తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రదర్శన చూడటానికి వెళ్లిన రేవతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసుకు సంబంధించి గతంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు.

ప్రమాదం జరిగి ఏడాది కావొస్తున్నా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. అతను ఇప్పటికీ నడవలేని, మాట్లాడలేని స్థితిలోనే ఉన్నాడని తండ్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, శ్రీతేజ్ ఆసుప‌త్రి ఖర్చుల నిమిత్తం గతంలో అల్లు అర్జున్, అల్లు అరవింద్ రూ. 75 లక్షలు అందించారు. అల్లు అర్జున్, అల్లు అరవింద్... బాధితుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు వారి బ్యాంకు ఖాతాలో రూ. 2 కోట్లు డిపాజిట్ చేసినట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు.


More Telugu News