వృద్ధురాలిని కలిసిన పవన్ కల్యాణ్ పై అనుచిత పోస్టు.. కఠిన చర్యలు తీసుకోవాలన్న జనసేన

  • ఇప్పటంలో వృద్ధురాలు నాగేశ్వరమ్మను కలుసుకున్న పవన్
  • కాళ్లకు నమస్కరించి, మాతృభావంతో ఆలింగనం చేసుకున్న జనసేనాని
  • ఈ ఘటనపై ఓ వ్యక్తి అనుచిత వ్యాఖ్యలతో పోస్టు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న అనుచిత ప్రచారం మరోసారి తీవ్ర వివాదానికి దారి తీసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పవన్‌ను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు, వికృత పోస్టులు చేయడం కొందరికి అలవాటుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనల్లో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ, కొందరి తీరు మాత్రం మారడం లేదు.


తాజాగా గుంటూరు జిల్లా ఇప్పటంలో పవన్ కల్యాణ్ ఓ వృద్ధురాలిని కలిసిన సందర్భానికి సంబంధించిన ఫొటోలను వక్రీకరించి, అసభ్యకర భావాలతో సోషల్ మీడియాలో పోస్టు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఆ ఫొటోలను చూసిన జనసేన నేతలు, కార్యకర్తలు, పవన్ అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురయ్యారు. పవన్ మానవతా భావాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా చేసిన ఈ చర్యపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.


ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇటీవల గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలోని వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మను పవన్ స్వయంగా కలిసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా పవన్ ఆమె కాళ్లకు నమస్కరించి, మాతృభావంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అంతేకాదు, వృద్ధురాలికి తక్షణ సహాయంగా రూ.50 వేల ఆర్థిక సాయం, ఆమె మనవడి చదువుకు రూ.లక్ష అందించి, భవిష్యత్తులోనూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పవన్ చేసిన ఈ మానవీయ చర్యకు ఆ వృద్ధురాలు భావోద్వేగానికి గురై ఆనందం వ్యక్తం చేశారు.


అయితే ఓ వ్యక్తి, ఆ ఫొటోలను అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. నిందితుడిని గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ చర్యను మహిళల పట్ల, వృద్ధుల పట్ల గౌరవం లేని దుర్మార్గ చర్యగా జనసేన నేతలు అభివర్ణిస్తున్నారు.


ఈ వ్యవహారంపై జనసేన కార్యకర్తలు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పవన్‌పై మాత్రమే కాదు, వృద్ధురాలి గౌరవాన్ని కూడా కించపరిచేలా చేసిన ఈ పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



More Telugu News