Jayshree Ullal: ఎవరీ జయశ్రీ ఉల్లాల్?.. సంపదలో ప్రపంచ టెక్ దిగ్గజాలను ఎలా దాటేశారు?

Jayshree Ullal surpasses tech giants in wealth
  • భారత సంతతి టెక్ ఎగ్జిక్యూటివ్‌లలో జయశ్రీ ఉల్లాల్ అగ్రస్థానం
  • సుందర్ పిచాయ్, సత్య నాదెళ్లను అధిగమించిన అరిస్టా నెట్‌వర్క్స్ సీఈఓ
  • హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో వెల్లడైన ఆసక్తికర విషయాలు
  • జయశ్రీ నికర సంపద రూ. 50,170 కోట్లుగా అంచనా
ప్రపంచ టెక్ రంగంలో భారత సంతతికి చెందిన అత్యంత సంపన్న ఎగ్జిక్యూటివ్‌లు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్. అయితే, తాజా నివేదికల ప్రకారం ఈ ఇద్దరినీ వెనక్కి నెట్టి అరిస్టా నెట్‌వర్క్స్ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. జయశ్రీ ఉల్లాల్ నికర సంపద రూ. 50,170 కోట్లుగా ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారత సంతతికి చెందిన అత్యంత సంపన్న ప్రొఫెషనల్ మేనేజర్‌గా ఆమె నిలిచారు. ఇదే జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల రూ. 9,770 కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉండగా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రూ. 5,810 కోట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నారు.

జయశ్రీ ఉల్లాల్ 2008 నుంచి కంప్యూటర్ నెట్‌వర్కింగ్ సంస్థ అయిన అరిస్టా నెట్‌వర్క్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఆమె నేతృత్వంలో ఈ కంపెనీ అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఫోర్బ్స్ కథనం ప్రకారం 2024లో కంపెనీ ఆదాయం 7 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 20 శాతం అధికం. కంపెనీ స్టాక్‌లో జయశ్రీకి దాదాపు 3 శాతం వాటా ఉంది.

1961లో లండన్‌లో జన్మించిన జయశ్రీ, తన ఐదో ఏట కుటుంబంతో కలిసి భారత్‌కు వచ్చారు. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం... ఆమె తండ్రి ఒక భౌతిక శాస్త్రవేత్త. ఆయన ఐఐటీల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. జయశ్రీ న్యూఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీలో పాఠశాల విద్యను అభ్యసించారు. అనంతరం తండ్రి ఉద్యోగరీత్యా శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లారు. అక్కడ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

కెరీర్ తొలినాళ్లలో ఏఎండీ, ఫెయిర్‌చైల్డ్ సెమీకండక్టర్ వంటి సంస్థల్లో పనిచేసిన జయశ్రీ, సిస్కోలో చేరాక ఉన్నత స్థాయికి ఎదిగారు. 2008లో కేవలం 30 మంది ఉద్యోగులతో ఉన్న అరిస్టా నెట్‌వర్క్స్‌లో చేరి, దానిని క్లౌడ్ నెట్‌వర్కింగ్ రంగంలో అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఆమె శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు.
Jayshree Ullal
Arista Networks
Satya Nadella
Sundar Pichai
Indian origin CEOs
Richest CEOs
Technology executives
Hurun India Rich List
Cloud networking
Silicon Valley

More Telugu News