JC Prabhakar Reddy: రాజీ కుదిరింది.. న్యూ ఇయర్ వేడుకలకు మాధవీలతను ఆహ్వానిస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి

Tadipatri New Year Festivities JC Prabhakar Reddy Extends Invite to Madhavi Latha
  • తాడిపత్రిలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న జేసీ
  • మూడు రోజుల పాటు కొనసాగనున్న సెలెబ్రేషన్స్
  • భద్రతపై పూర్తిగా దృష్టి సారిస్తామని వెల్లడి

తాడిపత్రిలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమవుతున్నారు. మూడు రోజుల పాటు కొనసాగే న్యూఇయర్‌ వేడుకలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ వేడుకలకు సినీ నటి మాధవీలతను ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు.


అనంతపురం కలెక్టరేట్ సమీపంలో మీడియాతో మాట్లాడిన జేసీ ప్రభాకర్‌రెడ్డి... పెన్నానది ఒడ్డున ఉన్న పార్కును వేడుకల వేదికగా ఎంపిక చేసినట్లు చెప్పారు. గతేడాది ఇదే పార్కులో జరిగిన న్యూఇయర్‌ వేడుకలపై మాధవీలత చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ అంశంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరిందని, అందుకే ఈసారి ఆమెను ఆహ్వానించాలని నిర్ణయించామని జేసీ తెలిపారు. అయితే రావడం పూర్తిగా ఆమె ఇష్టమేనని అన్నారు.


న్యూఇయర్‌ వేడుకలను అన్ని వర్గాల ప్రజలు ఆస్వాదించేలా ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లు చైర్మన్ వివరించారు. డిసెంబర్ 29న చిన్నపిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, కుటుంబ సమేతంగా హాజరవ్వొచ్చని తెలిపారు. 30న యువతను ఆకట్టుకునే కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 31న పెద్దల కోసం ప్రత్యేకంగా వేడుకలు ఉంటాయని వెల్లడించారు. 29, 30 తేదీల్లో అన్ని వయసుల వారు హాజరయ్యేలా అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.


వేడుకల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, పోలీస్‌ శాఖతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తామని జేసీ తెలిపారు. ప్రజలు సహకరించి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

JC Prabhakar Reddy
Tadipatri
Madhavi Latha
New Year Celebrations
Anantapur
AP Politics
TDP
Municipal Chairman

More Telugu News