మా వ్యాక్సిన్ సురక్షితం.. ఆస్ట్రేలియా ఆరోపణల్లో నిజం లేదన్న హైదరాబాద్ ఫార్మా సంస్థ

  • నకిలీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఆరోపణలను ఖండించిన హైదరాబాద్ ఐఐఎల్
  • ఆస్ట్రేలియా హెచ్చరికలు ప్రస్తుత వాస్తవాలను ప్రతిబింబించడం లేదని వెల్లడి
  • 2025 జనవరిలోనే ఒక బ్యాచ్‌ను గుర్తించి చర్యలు తీసుకున్నామని స్పష్టీకరణ
  • అధికారికంగా సరఫరా అవుతున్న తమ వ్యాక్సిన్లు పూర్తి సురక్షితమని భరోసా
హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ ఇండియన్ ఇమ్యునాలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) సంస్థ తాజాగా తమ యాంటీ-ర్యాబిస్ వ్యాక్సిన్ 'అభయ్‌రాబ్' నకిలీ డోసులు భారత్‌లో ఉత్ప‌త్తి అవుతున్నాయంటూ ఆస్ట్రేలియా ఆరోగ్య అధికారులు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఆ హెచ్చరికలు అనవసరమైనవని, ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉన్నాయని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

2023 నవంబర్ నుంచి భారత్‌లో నకిలీ అభయ్‌రాబ్ వ్యాక్సిన్ బ్యాచ్‌లు వాడ‌కంలో ఉన్నాయని ఆస్ట్రేలియా టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఈ వారం మొదట్లో ఒక హెచ్చరిక జారీ చేసింది. ఈ నకిలీ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ర్యాబిస్ నుంచి పూర్తి రక్షణ లభించకపోవచ్చని, కాబట్టి 2023 నవంబర్ 1 తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారు వైద్యులను సంప్రదించాలని సూచించింది.

ఈ ఆరోపణలపై ఐఐఎల్ స్పందిస్తూ, 2025 జనవరిలోనే ఒక బ్యాచ్ (నంబర్ KA 24014) ప్యాకేజింగ్‌లో తేడాను తాము గుర్తించామని, వెంటనే భారత రెగ్యులేటరీ, చట్ట అమలు సంస్థలకు ఫిర్యాదు చేశామని తెలిపింది. ఇది ఒక చిన్న త‌ప్పిదం వ‌ల్ల చోటుచేసుకున్న‌ సంఘటన అని, ప్రస్తుతం మార్కెట్‌లో ఆ నకిలీ బ్యాచ్ అందుబాటులో లేదని స్పష్టం చేసింది.

"మా సంస్థ నాణ్యతా ప్రమాణాలు, ఫార్మాకోవిజిలెన్స్ వ్యవస్థలు చాలా పటిష్ఠంగా ఉన్నాయి. ఐఐఎల్, దాని అధీకృత పంపిణీదారుల ద్వారా సరఫరా అయ్యే వ్యాక్సిన్లపై ప్రజలు పూర్తి నమ్మకం ఉంచవచ్చు" అని సంస్థ వైస్ ప్రెసిడెంట్ సునీల్ తివారీ భరోసా ఇచ్చారు.

భారత్‌లో తయారయ్యే ప్రతి వ్యాక్సిన్ బ్యాచ్‌ను కేంద్ర ప్రభుత్వ ప్రయోగశాల (సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీ) పరీక్షించిన తర్వాతే అమ్మకానికి అనుమతిస్తారని, ప్రభుత్వ సంస్థలు, అధీకృత పంపిణీదారుల ద్వారా సరఫరా అయ్యే వ్యాక్సిన్లు సురక్షితమైనవని ఐఐఎల్ వివరించింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 210 మిలియన్లకు పైగా అభయ్‌రాబ్ డోసులను భారత్‌తో పాటు 40 దేశాలకు సరఫరా చేశామని, భారత మార్కెట్‌లో 40 శాతం వాటా తమదేనని సంస్థ పేర్కొంది.


More Telugu News