శివాజీకి బహిరంగంగా మద్దతుగా నిలిచిన నటుడు రక్షిత్ అట్లూరి

  • శివాజీ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్న రక్షిత్ అట్లూరి
  • ఆయన వ్యాఖ్యల్లోని యథార్థాన్ని అర్థం చేసుకోవాలని వ్యాఖ్య
  • సమాజం మారాల్సిన అవసరం ఉందన్న రక్షిత్
  • మహిళలు ఎంతో గొప్పవారని వ్యాఖ్య

టాలీవుడ్‌లో ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం ఇంకా చల్లారడం లేదు. స్టేజ్‌పై ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు తీవ్ర విమర్శలకు దారి తీయడంతో, ఈ అంశం సినిమా పరిధిని దాటి సామాజిక చర్చగా మారింది. మహిళల దుస్తులపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై గాయని చిన్మయి, నటి అనసూయతో పాటు పలువురు మహిళా ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. విమర్శల నేపథ్యంలో శివాజీ క్షమాపణలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే.


అయితే, క్షమాపణ చెప్పినా ఆయన మాటల్లోని భావజాలమే అసలు సమస్య అంటూ విమర్శకులు మరో అడుగు ముందుకు వేశారు. ఈ క్రమంలో ఇండస్ట్రీ నుంచి భిన్నమైన స్వరాలు వినిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా నటుడు రక్షిత్ అట్లూరి కూడా శివాజీకి మద్దతుగా నిలిచారు.


‘పలాస 1978’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి, ఈ వివాదంపై ఓ వీడియో విడుదల చేస్తూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. శివాజీ వాడిన కొన్ని పదాలు తప్పు కావచ్చని అంగీకరించిన రక్షిత్, అందుకే ఆయన క్షమాపణలు కూడా చెప్పారని గుర్తు చేశారు. అయితే, శివాజీ చెప్పాలనుకున్న అసలు ఉద్దేశంలో మాత్రం తప్పు లేదని చెప్పారు.


శివాజీ మాటల్లోని యథార్థాన్ని అర్థం చేసుకోవాలని రక్షిత్ అన్నారు. సమంత చీర కట్టుకున్నా ఆమెకు ఏదో జరిగిందని కొందరు అంటున్నారని... సంప్రదాయబద్దంగా దుస్తులు ధరించినా ఇలా జరిగిందంటే... మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో ఆలోచించుకోవాలని చెప్పారు. ఇలాంటి సమాజంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సమాజం మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. కుటుంబాలు కూడా తమ పిల్లల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మహిళల గొప్పతనాన్ని గుర్తు చేస్తూ రక్షిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. “మహిళలు తక్కువా? ఎక్కువా? అనే ప్రశ్నే లేదు. వాళ్లు ఎంతో గొప్పవారు. మగవాళ్లుగా మన బాధ్యత వాళ్లను గౌరవించడం, రక్షించడం. ఆ రక్షణ గురించే శివాజీ గారు చెప్పాలని ప్రయత్నించారని నేను భావిస్తున్నాను” అని తెలిపారు.



More Telugu News