Danam Nagender: ఆరుసార్లు గెలిచా.. ఉప ఎన్నిక వచ్చినా మళ్లీ గెలుస్తా: దానం నాగేందర్

Khairatabad MLA Danam Nagender Ready for By Election
  • కార్యకర్తల అండ చూసుకునే రాజీనామా
  • వ్యక్తిగత విమర్శలు మానుకోవాలంటూ కేటీఆర్ కు సూచన
  • సీఎంపై విమర్శలు చేస్తే ప్రతివిమర్శలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం
పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై వేటు పడనుందనే ప్రచారం నేపథ్యంలో ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తలతో ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలే తన బలమని చెప్పారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానంటే దానికి కారణం తన కార్యకర్తలేనని, వారి అండతోనే తాను ధైర్యంగా ముందుకు వెళుతున్నానని చెప్పారు. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వస్తే తాను మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

వ్యక్తిగత విమర్శలు చేయొద్దు..
వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ కు దానం నాగేందర్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మళ్లీ గెలిపించాలా.. ఓడించాలా? అనేది ప్రజలే నిర్ణయించుకుంటారని చెప్పారు. రేవంత్ రెడ్డి గెలుపోటముల విషయం తర్వాత చూడొచ్చు ముందు మీ తప్పులను గుర్తించి సరిదిద్దుకోవాలని కేటీఆర్ కు హితవు పలికారు. ముఖ్యమంత్రి స్థానానికి గౌరవం ఇవ్వకుండా రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తూ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేశారని దానం గుర్తుచేశారు.

స్థాయిని మరిచి పరుష పదాలతో విమర్శలు చేసినపుడు అదేస్థాయిలో ప్రతివిమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా, ఇద్దరు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారంటూ కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ చేసిన ఆరోపణలపైనా దానం నాగేందర్ స్పందించారు. అవినీతికి పాల్పడుతున్నది కేంద్ర మంత్రులా? లేక రాష్ట్ర మంత్రులా? అన్నది చెప్పాలన్నారు. ఆరోపణలు చేయడం మాని హోంశాఖ సహాయ మంత్రిగా సదరు మంత్రులపై విచారణ జరిపించాలని బండి సంజయ్ ను ఆయన డిమాండ్ చేశారు.
Danam Nagender
Khairatabad
Telangana
KTR
Revanth Reddy
Bandi Sanjay
By Election
Himayat Nagar
Congress
BRS

More Telugu News