Aman Preet Singh: హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి కోసం గాలింపు

Hyderabad Drug Racket Rakul Preet Singhs Brother Being Searched
  • మాసబ్‌ట్యాంక్ పరిధిలో డ్రగ్స్ దందా
  • ట్రూప్ బజార్ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు అరెస్ట్
  • విచారణలో వెలుగులోకి వచ్చిన రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ పేరు

హైదరాబాద్ నగరాన్ని మరోసారి డ్రగ్స్ మాఫియా ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల పేర్లు వరుసగా బయటపడుతుండటంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, విదేశీ డ్రగ్స్ నెట్‌వర్క్ మాత్రం కొత్త కొత్త మార్గాల్లో బయటపడుతూనే ఉంది.


తాజాగా మాసబ్‌ట్యాంక్ పరిధిలో బయటపడిన డ్రగ్స్ కేసు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటపడటం కలకలం రేపుతోంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఈ కేసుల్లో చిక్కుకోవడం ఆందోళనకు కారణమవుతోంది.


మాసబ్‌ట్యాంక్ పోలీసులు, తెలంగాణ ‘ఈగల్ టీం’ సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక దాడుల్లో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ట్రూప్ బజార్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్తలు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్‌తో పాటు ఎండిఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 


విచారణలో ఈ ఇద్దరు వ్యాపారులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే విషయంతో పాటు, వారికి నలుగురు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ జాబితాలో టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నట్లు తేలింది. అతను తరచూ వీరి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది.


ఈ క్రమంలో, అమన్ ప్రీత్ సింగ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈగల్ టీం, మాసబ్‌ట్యాంక్ పోలీసులు కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గత ఏడాది కూడా సైబరాబాద్ పోలీసులకు డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ పట్టుబడి, బెయిల్‌పై బయటకు వచ్చినట్లు సమాచారం.


డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం స్పష్టం చేసిన నేపథ్యంలో, ఈ కేసులో త్వరలో కీలక అరెస్టులు జరిగే అవకాశముందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

Aman Preet Singh
Rakul Preet Singh
Hyderabad Drugs Case
Tollywood Drugs
Drug Trafficking
Cocaine
MDMA
Masab Tank
Telangana Eagle Team

More Telugu News