Shashi Tharoor: హైపర్ సోనిక్ క్షిపణులతో పాక్ డేంజర్ గేమ్.. బంగ్లాలో అస్థిరతపై శశి థరూర్ సీరియస్ వార్నింగ్!

Shashi Tharoor Warns on Pakistan Hyper Sonic Missile Threat
  • హైపర్ సోనిక్ సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న పాక్
  • బంగ్లాదేశ్‌లో అస్థిరత మన ఈశాన్య రాష్ట్రాలకు ముప్పన్న శశిథరూర్ 
  • ప్రపంచ వేదికలపై మోదీ ఓడిపోతే అది దేశానికే నష్టమని వ్యాఖ్య
పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు భారత భద్రతకు సవాలుగా మారుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ హెచ్చరించారు. పాకిస్థాన్ అనుసరిస్తున్న కొత్త మిలిటరీ వ్యూహాలను, ముఖ్యంగా 'హైపర్ సోనిక్ క్షిపణి' సాంకేతికతపై ఆ దేశం పెడుతున్న దృష్టిని భారత్ ఎంతమాత్రం విస్మరించకూడదని ఆయన స్పష్టం చేశారు. ‘ఇండియా టుడే టీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో థరూర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్ ప్రస్తుతం 'అసిమెట్రిక్ డెటరెన్స్'అనే కొత్త సైనిక సిద్ధాంతాన్ని అనుసరిస్తోందని థరూర్ వివరించారు. డ్రోన్లు, రాకెట్ల దాడుల తర్వాత ఇప్పుడు వారు హైపర్ సోనిక్ సాంకేతికత వైపు మళ్లుతున్నారని, ఇది భారత రక్షణ వ్యవస్థలకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందన్నారు. పాక్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికీ, సైన్యం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఇటువంటి సాహసోపేతమైన మిలిటరీ చర్యలకు పాల్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న అస్థిరత భారత్‌కు పెద్ద ఆందోళన కలిగించే విషయమని థరూర్ పేర్కొన్నారు. శాంతియుతమైన బంగ్లాదేశ్ భారత్ ప్రయోజనాలకు అత్యంత అవసరమని, అక్కడ అస్థిరత ఏర్పడితే అది భారత్‌కు 'సాఫ్ట్ అండర్ బెల్లీ'గా మారుతుందని హెచ్చరించారు. ఈ అస్థిరతను అదునుగా తీసుకుని పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే ప్రమాదం ఉందని గుర్తుచేశారు.

భారత విదేశాంగ విధానం విషయంలో జాతీయ ఐక్యత ఉండాలని థరూర్ పిలుపునిచ్చారు. "ఇది బీజేపీ విదేశాంగ విధానమో, కాంగ్రెస్ విదేశాంగ విధానమో కాదు.. ఇది భారత విదేశాంగ విధానం" అని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ప్రపంచ వేదికపై ఓడిపోతే అది దేశానికే నష్టమని పేర్కొంటూ , భారతదేశం చనిపోతే, ఇక వుండేదెవరు? అన్న నెహ్రూ మాటలను ఉటంకిస్తూ, తనకు ఎప్పుడూ 'భారతదేశమే ప్రథమం' అని థరూర్ తన నిబద్ధతను చాటుకున్నారు.
Shashi Tharoor
Pakistan
Bangladesh
India security
Hyper Sonic Missile
ISI
Asymmetric Deterrence
Military strategy
Northeast India
Foreign policy

More Telugu News