TTD: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందడి.. టోకెన్ ఉంటే 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం

Tirumala Vaikunta Ekadasi Darshan in 2 Hours with Token Says Anil Kumar Singhal
  • ఈనెల‌ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు
  • సామాన్య భక్తులకే ప్రాధాన్యం.. బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు
  • ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రద్దీ పర్యవేక్షణ
  • భక్తుల సౌకర్యార్థం భారీ భద్రత, అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల‌ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ పది రోజులూ సమాన పవిత్రత కలిగినవని, ఏ రోజు దర్శించుకున్నా ఒకే రకమైన పుణ్యఫలం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

పది రోజుల్లో మొత్తం 7,70,000 మంది భక్తులకు దర్శనం 
దర్శనం కోసం టోకెన్లు పొందిన భక్తులు, తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వస్తే కేవలం రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తవుతుందని ఈవో తెలిపారు. ఇందుకోసం మూడు ప్రత్యేక ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ పది రోజుల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా మొత్తం 7,70,000 మంది భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. రద్దీని పర్యవేక్షించేందుకు, భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను వినియోగిస్తున్నామని, ప్రతి రెండు గంటలకోసారి రద్దీ వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

సామాన్య భక్తులకే పెద్దపీట
ఈ పది రోజుల దర్శన కాలంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేసినట్లు ఈవో తెలిపారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలను సాధారణ భక్తులకే కేటాయించామన్నారు. ప్రివిలేజ్, బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశామని, కేవలం ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా 16 రకాల ప్రసాదాలు, పానీయాలు అందిస్తామన్నారు. భద్రత కోసం 2400 మంది పోలీసులు, 1100 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని నియమించారు. వీరికి సహాయంగా ఆరు లక్షల మంది శ్రీవారి సేవకులు అందుబాటులో ఉంటారు. భక్తులు టోకెన్లలో పేర్కొన్న సమయానికే తిరుమలకు వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని ఈవో విజ్ఞప్తి చేశారు.
TTD
Anil Kumar Singhal
Tirumala
Vaikunta Ekadasi
Srivari Darshan
Tirumala Temple
Token Darshan
Andhra Pradesh
Hindu Festival
Artificial Intelligence

More Telugu News