National Citizen Party: బంగ్లాదేశ్‌లో ముక్కలవుతున్న విద్యార్థుల పార్టీ.. 'మతతత్వ' పొత్తుపై అంతర్గత యుద్ధం!

National Citizen Party Faces Division Over Alliance in Bangladesh
  • జమాతే ఇస్లామీతో 30 సీట్ల ఒప్పందానికి ఎన్‌సీపీ మొగ్గు  
  • ఒక వర్గం జమాతేను, మరో వర్గం బీఎన్‌పీని సమర్థిస్తుండటంతో కీలక నేతల రాజీనామా
  • అవామీ లీగ్ రేసులో లేకపోవడంతో ప్రధాన పార్టీల మధ్య ముదిరిన పోరు 
  • ఫిబ్రవరి 12న జరగనున్న ఎన్నికలపై నీలినీడలు
బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. షేక్ హసీనాను గద్దె దించిన విద్యార్థి ఉద్యమం నుంచి పుట్టిన 'నేషనల్ సిటిజన్ పార్టీ' (ఎన్‌సీపీ) ప్రస్తుతం ఉనికి కోసం పోరాడుతోంది. మహమ్మద్ యూనస్ అండదండలు ఉన్నాయని భావించే ఈ 'కింగ్స్ పార్టీ' ఇప్పుడు మతతత్వ పార్టీ అయిన 'జమాతే ఇస్లామీ'తో పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తుండటం ఆ పార్టీలో తీవ్ర చీలికకు దారితీసింది.

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ), జమాతే ఇస్లామీ వంటి దిగ్గజ పార్టీలను ఎదుర్కొనేందుకు తొలుత ఒంటరిగా పోరాడుతామని ప్రకటించిన ఎన్‌సీపీ ఇప్పుడు తన పంథాను మార్చుకుంది. 350 స్థానాలున్న పార్లమెంటులో కనీసం 50 సీట్లు కావాలని జమాతేను కోరగా.. చివరకు కేవలం 30 స్థానాల వద్ద రాజీ పడటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికోసం జమాతే నుంచి భారీగా నిధులు అందుతున్నాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు.. "యువత రాజకీయాలకు సమాధి కడుతున్నారు" అని మండిపడుతున్నారు.

చీలిక దిశగా.. రాజీనామాల పర్వం
జమాతేతో పొత్తును వ్యతిరేకిస్తున్న ఒక వర్గం తారిఖ్ రెహమాన్ స్వదేశానికి రావడంతో బీఎన్‌పీ వైపు మొగ్గు చూపుతోంది. ఈ అంతర్గత విభేదాల వల్ల పార్టీ జాయింట్ మెంబర్ సెక్రటరీ మీర్ అర్షదుల్ హక్ వంటి కీలక నేతలు ఇప్పటికే రాజీనామా చేశారు. సామాజిక మాధ్యమాల్లో బలంగా కనిపిస్తున్న ఈ పార్టీకి క్షేత్రస్థాయిలో పట్టు లేకపోవడంతోనే ఇతర పార్టీలపై ఆధారపడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అయోమయంలో యూనస్ సర్కార్
ఒకవైపు హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌పై నిషేధం ఉండటంతో ఎన్నికల బరిలో బీఎన్‌పీ, జమాతే మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మరోవైపు దేశంలో హింసాత్మక ఘటనలు పెరగడం, మైనారిటీలపై దాడులు జరగడం ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. యూనస్ ప్రభుత్వం శాంతిభద్రతలను అదుపు చేయడంలో విఫలమైందన్న ఆరోపణల మధ్య ఎన్‌సీపీ సంక్షోభం ఎన్నికల ముఖచిత్రాన్ని మరింత మార్చే అవకాశం ఉంది.
National Citizen Party
Bangladesh Election
Sheikh Hasina
Jamaat-e-Islami
Bangladesh Nationalist Party
Mohammad Yunus
Bangladesh Politics
Political Alliance
Tareq Rahman
Bangladesh Minorities

More Telugu News