జలాంతర్గామిలో ప్రయాణించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

  • 28న కర్ణాటకలోని కర్వార్ హార్బర్ నుంచి ప్రయాణించనున్న రాష్ట్రపతి
  • రేపటి నుంచి నాలుగు రోజుల పాటు గోవా, ఝార్ఖండ్, కర్ణాటకలలో పర్యటించనున్న రాష్ట్రపతి
  • జలాంతర్గామిలో ప్రయాణిస్తారని తెలిపిన రాష్ట్రపతి భవన్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించనున్నారు. ఈ నెల 28న కర్ణాటకలోని కార్వాడ్ నౌకాశ్రయం నుంచి ఆమె ప్రయాణం సాగుతుందని రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు ఆమె గోవా, ఝార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె జలాంతర్గామిలో ప్రయాణిస్తారని ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రపతి ముర్ము రెండు నెలల క్రితం రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రఫేల్‌‍లో ఆమె ప్రయాణించిన విషయం తెలిసిందే. అంతకుముందు 2023 మే 8న అసోంలోని తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానంలో ఆమె విహరించారు.

సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానంలో విహరించిన రెండో మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు. అంతకుముందు, 2009లో ప్రతిభా పాటిల్ గగనయానం చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా 2006లో పుణే వాయుసేన స్థావరం నుంచి సుఖోయ్-30లో ప్రయాణించారు.


More Telugu News