Pawan Kalyan: ఢిల్లీ హైకోర్టులో పవన్ కల్యాణ్ కు ఊరట

Pawan Kalyan Gets Relief in Delhi High Court
  • పవన్ కల్యాణ్ వ్యక్తిగత హక్కులకు ఢిల్లీ హైకోర్టు రక్షణ
  • ఆయన పేరు, ఫొటో, వాయిస్‌ను వాణిజ్యపరంగా వాడొద్దని ఆదేశం
  • ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థలకు కీలక సూచనలు
  • ఏఐ, డీప్‌ఫేక్‌ల ద్వారా కంటెంట్ సృష్టిపైనా ఆంక్షలు
  • ఫ్యాన్ పేజీలకు మినహాయింపు... స్పష్టమైన డిస్‌క్లెయిమర్ తప్పనిసరి
టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన పేరు, చిత్రం, గొంతు, వ్యక్తిగత గుర్తింపులను ఎలాంటి అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకుండా పలు ఆన్‌లైన్ సంస్థలు, ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు, వెబ్‌సైట్లపై మధ్యంతర ఉత్తర్వులు (యాడ్-ఇంటరిమ్ ఇంజంక్షన్) జారీ చేసింది.

తన వ్యక్తిగత, ప్రచార హక్కులకు (పర్సనాలిటీ అండ్ పబ్లిసిటీ రైట్స్) భంగం కలుగుతోందని ఆరోపిస్తూ పవన్ కల్యాణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాతో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ ఎక్స్‌పార్టీ ఆదేశాలు ఇచ్చింది. మూడు దశాబ్దాలుగా సినీ, రాజకీయ రంగాల్లో ఉన్న పవన్ కల్యాణ్‌కు గణనీయమైన వాణిజ్య బ్రాండ్ విలువ ఉందని, ఆయన వ్యక్తిగత హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

పలు సంస్థలు పవన్ కల్యాణ్ అనుమతి లేకుండా ఆయన ఫొటోలతో టీ-షర్టులు, కప్పులు, పోస్టర్లు వంటివి అమ్ముతున్నాయని, ఏఐ టూల్స్ ద్వారా ఆయన గొంతు, ఫొటోలను వాడుతున్నారని, సోషల్ మీడియాలో ఫేక్ పేజీలు నిర్వహిస్తున్నారని పవన్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల పవన్‌కు పూడ్చలేని నష్టం వాటిల్లుతుందని ధర్మాసనం పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో వంటి ఈ-కామర్స్ వేదికల నుంచి అలాంటి ఉత్పత్తులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. వాటిని అమ్ముతున్న విక్రయదారుల కేవైసీ వివరాలను పిటిషనర్‌కు అందించాలని సూచించింది. పవన్ పేరును దుర్వినియోగం చేస్తున్న వెబ్‌సైట్ లింకులను వారం రోజుల్లోగా తొలగించాలని స్పష్టం చేసింది. అయితే, ఫ్యాన్ పేజీలకు మాత్రం కొన్ని షరతులతో మినహాయింపు ఇచ్చింది. అవి 'ఫ్యాన్ పేజీ' అని స్పష్టమైన డిస్‌క్లెయిమర్ ఇవ్వాలని, లేనిపక్షంలో వాటిని కూడా నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేసింది.
Pawan Kalyan
Delhi High Court
personality rights
publicity rights
AI platforms
online platforms
interim injunction
trademark infringement
e-commerce
fake pages

More Telugu News