Tata Steel: రూ. 14,370 కోట్లు చెల్లించాలంటూ టాటా స్టీల్ పై ఎన్‌జీవో దావా
- టాటా స్టీల్ పై న్యాయపోరాటం చేస్తున్న ఎన్‌జీవో
- కంపెనీ కార్యకలాపాల వల్ల ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని ఆరోపణ
- ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన టాటా స్టీల్
టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ నెదర్లాండ్ యూనిట్‌పై అక్కడి ఓ స్వచ్ఛంద సంస్థ న్యాయపోరాటానికి దిగింది. కంపెనీ కార్యకలాపాల వల్ల స్థానిక ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ నెదర్లాండ్స్‌లోని నార్త్ హాలెండ్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా దాఖలు చేసింది. పరిహారంగా 1.6 బిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.14,370 కోట్లను చెల్లించాలని డిమాండ్ చేసింది.
ఈ విషయాన్ని టాటా స్టీల్ తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. నెదర్లాండ్స్‌లోని వెల్సన్-నూర్డ్ ప్రాంతంలో ఉన్న ఐజ్మెయిడన్ బీవీ ప్లాంట్ నుంచి వెలువడే కాలుష్యకారకాలు స్థానికుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆ స్వచ్ఛంద సంస్థ ఆరోపిస్తోంది. కాలుష్య ప్రభావంతో ప్రజలు నిరంతర భయాందోళనల్లో జీవించాల్సి వస్తోందని, ఇంట్లో ప్రశాంతంగా గడపలేకపోతున్నారని, అంతేకాదు ఆ ప్రాంతంలోని ఆస్తుల విలువ కూడా పడిపోయిందనేది ఎన్‌జీవో వాదనగా ఉంది.
అయితే ఈ ఆరోపణలను టాటా స్టీల్ తీవ్రంగా ఖండించింది. ఎన్‌జీవో చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. తమ కార్యకలాపాలు నిబంధనలకు అనుగుణంగానే సాగుతున్నాయని, పర్యావరణ పరిరక్షణ విషయంలో తమకు అనుకూలంగా బలమైన ఆధారాలు ఉన్నాయని టాటా స్టీల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఈ కేసు విచారణ రెండు దశల్లో కొనసాగుతుందని, ఒక్కో దశ పూర్తయ్యేందుకు కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల ఇప్పట్లో పరిహారం చెల్లించే అంశం తలెత్తే అవకాశమే లేదని టాటా స్టీల్ స్పష్టం చేసింది.
మరోవైపు, నెదర్లాండ్స్ ప్రభుత్వంతో కలిసి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టామని, ఉద్గారాలను నియంత్రించే దిశగా పెట్టుబడులు పెట్టి ఆధునిక సాంకేతికతను అమలు చేస్తున్నామని టాటా స్టీల్ పేర్కొంది.