APSRTC Employees: మెడికల్ అన్‌ఫిట్‌ ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

APSRTC Employees AP Govt Good News for Medically Unfit RTC Employees
  • మెడికల్ అన్‌ఫిట్‌గా తేలిన ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట
  • వారికి ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయంః
  • 2020 జనవరి 1 తర్వాత అన్‌ఫిట్ అయిన వారికి వర్తింపు
  • ఈ నిర్ణయంపై ఉద్యోగ వర్గాల్లో హర్షం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో పనిచేస్తూ వైద్యపరమైన కారణాలతో అనర్హులుగా (మెడికల్ అన్‌ఫిట్‌) తేలిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. అలాంటి వారికి ఇతర ప్రభుత్వ శాఖల్లో ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత, అంటే 2020 జనవరి 1 నుంచి మెడికల్ అన్‌ఫిట్‌గా నిర్ధారణ అయిన ఉద్యోగులందరికీ ఈ నిర్ణయం వర్తిస్తుంది. అనారోగ్య కారణాలతో ఉపాధి కోల్పోయిన అనేక మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఈ ఉత్తర్వుల వల్ల గణనీయమైన భరోసా లభించనుంది.

గతంలో ఆర్టీసీలో ఉండగా మెడికల్ అన్‌ఫిట్‌గా తేలితే ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చేది. అయితే, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన నేపథ్యంలో, వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి, వారి అర్హతలకు అనుగుణంగా ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తాజా చర్యతో బాధిత ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ భద్రత లభించనుంది. ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

దీనిపై ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ఏపీఎస్ఆర్టీసీ నుంచి ప్రభుత్వ సేవల్లోకి జనవరి 2020 లో విలీనం అయిన ఉద్యోగులు, వైద్యపరంగా విధులకు అనర్హులుగా ప్రకటించబడిన ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి తగిన చర్యలు ప్రారంభించిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వికలాంగుల హక్కుల చట్టం–2016 ప్రకారం అర్హత కలిగిన ఉద్యోగులకు ప్రాధాన్యత క్రమంలో ప్రత్యామ్నాయ ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. అవసరమైన మేరకు జిల్లా కలెక్టర్ల సహకారంతో ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా ప్రత్యామ్నాయ ఉద్యోగాల్లో నియామక అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని వివరించారు. 

ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం, ఆమోదించిన జాబితాలోకి రాని వైద్య కారణాల వలన అనర్హులైన ఉద్యోగులకు, ఆర్టీసీ లో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం మానిటరీ కాంపెన్సేషన్ అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల సానుకూలత ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఎవరూ నష్టపోకుండా చూడటం కూటమి ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల జీవన భద్రత, వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 

ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సానుకూల దృక్పథంతో ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
APSRTC Employees
APSRTC
Andhra Pradesh
Medical Unfit Employees
Chandrababu Naidu
Mandipli Ramprasad Reddy
Government Jobs
AP Government
RTC Merger
Alternative Jobs

More Telugu News