'ధురంధర్' సినిమా ఘన విజయంతో... కీలక నిర్ణయం తీసుకున్న రణవీర్ , అక్షయ్ ఖన్నా

  • బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసిన 'ధురంధర్'
  • పూర్తిగా ఒరిజినల్ కంటెంట్ పై దృష్టి పెట్టాలనుకుంటున్న రణ్ వీర్ సింగ్
  • అక్షయ్ ఖన్నా తలుపు తడుతున్న సోలో హీరో అవకాశాలు

బాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో 'ధురంధర్' ఘన విజయం సాధించింది. ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. విడుదలై ఇప్పటికే 20 రోజులు పూర్తైనా, ఇంకా థియేటర్ల వద్ద కలెక్షన్ల ప్రవాహం ఆగడం లేదు. 


ప్రధానంగా రణ్‌ వీర్ సింగ్ ఎనర్జీతో నిండిన నటన, అక్షయ్ ఖన్నా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అన్నీ కలిసి 'ధురంధర్'ను ఓ సాలిడ్ యాక్షన్ డ్రామాగా నిలబెట్టాయి. అయితే ఈ సక్సెస్‌తో రణ్‌ వీర్ సింగ్ తన కెరీర్ దిశను మార్చుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు రీమేక్స్, సీక్వెల్స్, ఫ్రాంచైజీల్లో భాగమవుతూ వచ్చిన రణ్‌ వీర్, ఇకపై పూర్తిగా ఒరిజినల్ కంటెంట్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడట. ఇదే క్రమంలో ఆయన భారీ అంచనాలున్న 'డాన్ 3' ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.


'ధురంధర్' సక్సెస్ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో రణ్‌వీర్ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచడంతో పాటు, కథలో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉండాలని కోరాడని ఇండస్ట్రీ టాక్. ‘డాన్’ వంటి బ్రాండ్‌లో ఇమడడం కంటే, తన సొంత ఇమేజ్‌ను మరింత బలంగా నిలబెట్టే సినిమాలు చేయడమే మంచిదని ఆయన భావిస్తున్నాడట. అందుకే ‘శక్తిమాన్’ లాంటి భారీ ప్రాజెక్టులు లేదా 'ధురంధర్' సీక్వెల్స్‌పై ఫోకస్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.


రణ్‌వీర్ బాటలోనే సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. 'ధురంధర్'లో ఆయన పోషించిన పాత్రకు వచ్చిన రెస్పాన్స్‌తో అక్షయ్ ఖన్నా మార్కెట్ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా ఆయన నటనకు ప్రశంసల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఆయన 'దృశ్యం 3' ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.


'దృశ్యం 2'లో ఐజీ బాస్టన్ రాజ్ పాత్రలో అక్షయ్ ఖన్నా చూపిన ఇంటెన్సిటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మూడో భాగంలో అజయ్ దేవగణ్ తో మరింత పవర్‌ఫుల్ ఫేస్ ఆఫ్ ఉంటుందని భావించిన అభిమానులకు ఈ వార్త కొంత షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు అక్షయ్ ఖన్నాకు సోలో హీరోగా, లేదా ప్యారలల్ లీడ్‌గా భారీ ఆఫర్లు వస్తుండటంతో, ఒకే ఫ్రాంచైజీకి పరిమితం కావడం ఆయనకు ఇష్టం లేకపోయిందట.


మొత్తానికి 'ధురంధర్' సినిమా రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నాల కెరీర్‌లను కొత్త మలుపు తిప్పిందని చెప్పొచ్చు. ఈ విజయం తర్వాత వీరిద్దరూ మరింత బలమైన, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల వైపు అడుగులు వేస్తుండటం బాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.



More Telugu News