West Bengal Hotels: బంగ్లాదేశ్ టూరిస్టులకు 'నో ఎంట్రీ'.. బెంగాల్ హోటళ్ల సంచలన నిర్ణయం!

Bangladesh Tourists No Entry to Bengal Hotels Over Hindu Worker Murder
  • బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్యపై పశ్చిమ బెంగాల్‌లో నిరసన
  • బంగ్లాదేశ్ పర్యాటకులకు హోటళ్లలో బస నిరాకరిస్తున్న సంఘాలు
  • డార్జిలింగ్, మాల్దా జిల్లాల హోటల్ యజమానుల ఏకగ్రీవ నిర్ణయం
  • మైనారిటీలపై దాడులను తీవ్రంగా ఖండించిన హోటళ్ల సంఘాలు
బంగ్లాదేశ్‌లో హిందూ గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు దీపు చంద్ర దాస్‌ను అత్యంత దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్‌లోని రెండు జిల్లాల హోటళ్ల సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే పర్యాటకులకు తమ హోటళ్లు, లాడ్జీలలో బస కల్పించబోమని ఈరోజు ప్రకటించాయి. మహమ్మద్ యూనస్ పాలనలో మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశాయి.

బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటున్న డార్జిలింగ్, మాల్దా జిల్లాల హోటల్ యజమానుల సంఘాలు ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. "మా సంఘంలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా బంగ్లాదేశ్ పర్యాటకులకు గదులు కేటాయించకూడదని నిర్ణయించారు. ప్రస్తుతం మా జిల్లాలోని ఏ హోటల్‌లోనూ బంగ్లాదేశ్ టూరిస్టులు లేరు" అని మాల్దా హోటల్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణేందు చౌదరి తెలిపారు. వైద్య వీసాలపై చికిత్స కోసం వచ్చేవారికి ఈ నిషేధం వర్తింపజేయాలా? వద్దా? అనే అంశంపై త్వరలో మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు.

అయితే, డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి హోటలియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించింది. వైద్య, విద్యార్థి వీసాలపై వచ్చే బంగ్లాదేశీయులకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని ఆ సంఘం కార్యదర్శి ఉజ్వల్ ఘోష్ స్పష్టం చేశారు. "సిలిగురి కారిడార్‌పై బంగ్లాదేశ్ నేతలు సున్నితమైన వ్యాఖ్యలు చేయడం, హిందూ మైనారిటీలపై దాడులు తీవ్రస్థాయికి చేరడం ఆమోదయోగ్యం కాదు" అని ఆయన అన్నారు. ఈ రెండు సంఘాల నిర్ణయానికి స్థానిక ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మద్దతు ప్రకటించాయి.

ఇటీవల బంగ్లాదేశ్‌లో దైవదూషణ ఆరోపణలతో 25 ఏళ్ల దీపు చంద్ర దాస్‌ను ఫ్యాక్టరీ నుంచి బయటకు లాక్కొచ్చి, కర్రలతో కొట్టి చంపి, చెట్టుకు కట్టేసి నిప్పంటించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
West Bengal Hotels
Deepu Chandra Das
Bangladesh
Hindu minorities
Malda
Darjeeling
Siliguri
Hotel Association
Bangladesh Tourists
India Bangladesh relations

More Telugu News