Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావు విడుదల

Telangana phone tapping case Ex SIB chief Prabhakar Rao released after two week custody
  • రెండు వారాల పాటు ప్రభాకర్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు
  • జనవరి 16న సుప్రీంకోర్టుకు విచారణ నివేదిక సమర్పించనున్న సిట్‌
  • మాజీ సీఎం, మంత్రులను విచారించే అవకాశంపై చర్చలు
తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇవాళ‌ విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండు వారాల పాటు కస్టడీలో విచారించిన అనంతరం, గడువు ముగియడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయనను విడిచిపెట్టారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈనెల‌ 12న సిట్ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావును అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన విచారణకు సహకరించడం లేదని భావించి కస్టడీని పొడిగించారు. పదవీ విరమణ తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ను ఎస్ఐబీ చీఫ్‌గా ఎందుకు నియమించిందనే కోణంలో సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. మాజీ మంత్రి హరీశ్ రావుతో తరచూ ఎందుకు భేటీ అయ్యారని ప్రశ్నించగా, మావోయిస్టుల ముప్పు గురించి వివరించడానికేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో భాగంగా మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో కలిపి ప్రభాకర్ రావును విచారించారు. దీంతో పాటు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వంటి ఉన్నతాధికారుల వాంగ్మూలాలను కూడా సిట్ నమోదు చేసింది. ప్రభాకర్ రావు కస్టడీ విచారణపై జనవరి 16న సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక సమర్పించనుంది.

మరోవైపు ఈ కేసులో తదుపరి చర్యలపై ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సమావేశమై చర్చించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లను ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం అక్రమంగా ట్యాపింగ్ చేసిందని ప్రధాన ఆరోపణగా ఉంది.
Prabhakar Rao
Telangana phone tapping case
Telangana politics
BRS government
SIT investigation
cyber crime
KCR
Harish Rao
KTR

More Telugu News