: తొలి బంతికే డకౌట్ అయిన రోహిత్ శర్మ.. నిశ్శబ్దంగా మారిపోయిన స్టేడియం
- విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరాఖండ్ తో ముంబై మ్యాచ్
- తొలి ఓవర్ తొలి బంతికే గోల్డెన్ డక్ అయిన రోహిత్
- గుజరాత్ తో 77 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ
విజయ్ హజారే ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో మెరుపు శతకంతో అభిమానులను ఉర్రూతలూగించిన టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు ఈ రోజు మాత్రం కలిసిరాలేదు. నేటి మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ అయి అభిమానులను నిరాశపరిచాడు. ఫామ్‌లో ఉన్న రోహిత్ ఇలా గోల్డెన్ డకౌట్ కావడం క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేసింది.
జైపుర్ వేదికగా ముంబై – ఉత్తరాఖండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఉత్తరాఖండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టుకు ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఊహించని షాక్ తగిలింది. తొలి ఓవర్‌లోనే దేవేంద్ర సింగ్ బోరా వేసిన మొదటి బంతికి రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. జగమోహన్ నాగర్‌కోటి అందుకున్న ఆ క్యాచ్‌తో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది.
ఇదే టోర్నీలో సిక్కింతో మొన్న జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ అసాధారణ ప్రదర్శన చేశాడు. కేవలం 62 బంతుల్లోనే శతకం సాధించి, మొత్తంగా 155 పరుగులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ మ్యాచ్‌తో రోహిత్ ఫామ్ తిరిగి వచ్చిందని అభిమానులు భావించారు. కానీ, ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో తొలి బంతికే ఔట్ కావడం క్రికెట్‌లో అనిశ్చితి ఎంత తీవ్రంగా ఉంటుందో మరోసారి చూపించింది.
ఇదే సమయంలో బెంగళూరు వేదికగా ఢిల్లీ – గుజరాత్ జట్ల మధ్య మరో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి 61 బంతుల్లో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
ఇక మరో ఆసక్తికర పరిణామంగా, యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రతిష్ఠాత్మక ప్రధానమంత్రి జాతీయ బాలల అవార్డు లభించింది. ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో జరిగే అవార్డు ప్రదానోత్సవానికి ఆయన ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలైన పిల్లలను సత్కరించనుండగా, అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ వారితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ కారణంగా విజయ్ హజారే ట్రోఫీలో బిహార్ – మణిపుర్ మధ్య జరిగే మ్యాచ్‌కు వైభవ్ దూరమయ్యాడు.