Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. పిల్లల ముందే భార్యను సజీవ దహనం చేసిన భర్త

Hyderabad Man Sets Wife Ablaze In Front Of Children Pushes Daughter In Fire
  • భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన భర్త
  • హైదరాబాద్ నల్లకుంటలో క్రిస్మస్‌కు ముందు రోజు ఘటన
  • తల్లిని కాపాడబోయిన కుమార్తెను నిప్పుల్లోకి తోసిన నిందితుడు
  • పరారీలో ఉన్న భర్త వెంకటేశ్ కోసం పోలీసుల గాలింపు
హైదరాబాద్‌ నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త, కన్న పిల్లల కళ్లెదుటే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. అడ్డువచ్చిన కుమార్తెను కూడా నిప్పుల్లోకి తోసి అక్కడి నుంచి పరారయ్యాడు. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో క్రిస్మస్‌కు ఒక రోజు ముందు, ఈ నెల‌ 24న ఈ  ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్, త్రివేణి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా భార్య త్రివేణి ప్రవర్తనపై వెంకటేశ్ అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడుతూ, వేధించేవాడు. ఈ క్రమంలో ఈ నెల‌ 24న పిల్లల ముందే భార్యపై దాడి చేసి, ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న తల్లిని కాపాడేందుకు కుమార్తె ప్రయత్నించగా, ఆమెను కూడా నిప్పుల్లోకి తోసి అక్కడినుంచి పారిపోయాడు.

వారి అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునేసరికే త్రివేణి తీవ్ర గాయాలతో మృతి చెందింది. స్వల్ప గాయాలతో బయటపడిన కుమార్తెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భర్త వేధింపులు భరించలేక త్రివేణి ఇటీవల పుట్టింటికి వెళ్లిందని, మళ్లీ మారతానని వెంకటేశ్ నమ్మబలకడంతోనే ఆమె తిరిగి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు వెంకటేశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Hyderabad
Venkatesh
Wife burned alive
Domestic violence
Nallakunta police station
Crime news
Murder case
Crime News

More Telugu News