ఆకట్టుకునే కథ, నూతన నటీనటులతో రూపొందిన చిత్రాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. ఈ కోవలోనే ఈ మధ్య వచ్చిన నూతన తారలు నటించిన చిన్న చిత్రాలు మంచి విజయాల్నినమోదు చేసుకున్నాయి. ఈ జాబితాలోనే నూతన తారలతో రూపొందిన 'పతంగ్‌' చిత్రం టీజర్‌, ట్రైలర్‌తో ఆకట్టుకుంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? మరో చిన్న సినిమాకు విజయం దక్కిందా? సినిమా సమీక్షలో తెలుసుకుందాం.  

కథ: హైదరాబాద్‌ పాతబస్తీలో పెరిగిన ఇద్దరు స్నేహితులు  విజయ్‌ కృష్ణ అలియాస్‌ విస్కీ  (వంశీ పూజిత్‌), అరుణ్‌ (ప్రణవ్‌ కౌశిక్‌)లు చిన్నప్పట్నుంచి ప్రాణ మిత్రులు. అరుణ్‌ రిచ్‌ కిడ్‌ అయినా కూడా విస్కీతో వారి ఫ్యామిలీతో ఎంతో ఆత్మీయంగా ఉంటాడు. మొదటి చూపులోనే ఐశ్వర్య ప్రేమలో పడతాడు విస్కీ. విస్కీని కూడా ఐశ్వర్య ఇష్టపడుతుంది. అయితే ఈ సమయంలోనే అరుణ్‌ని చూసి ఇష్టపడిన ఐశ్వర్య అతని లవ్‌లో పడిపోతుంది. కొన్ని రోజులు విస్కీకి తెలియకుండా తన ప్రేమను దాచిపెడతారు. అయితే విస్కీకి ఈ ఇద్దరి ప్రేమ గురించి తెలియడంతో ప్రాణ స్నేహితుల మధ్య గొడవలు ప్రారంభమవుతాయి. కానీ ఐశ్వర్య మాత్రం తనకు ఇద్దరంటే ప్రేమ అని చెబుతుంది. ఐశ్వర్య ఎవరికి దక్కాలి అనే విషయంపై పతంగ్‌ల పోటీ జరుగుతుంది? ఇక ఆ తరువాత జరిగిందేమిటి? విస్కీతో ప్రేమలో ఉండగానే, అరుణ్‌కు ఎలా దగ్గరైంది? చివరికి ఐశ్వర్య ఎవరికి దక్కింది? పతంగుల పోటీలో ఎవరు గెలిచారు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ఇది మన సినిమా భాషలో చెప్పాలంటే ఇదొక ముక్కోణపు ప్రేమకథ. ఇలాంటి కథాంశంతో గతంలో ప్రేమదేశం, ఇటీవల బేబీ లాంటి చిత్రాలు వచ్చాయి. ఇది కూడా ఓ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీనే. అయితే ఈ ప్రేమకథ చుట్టు దర్శకుడు ప్రణీత్‌ పత్తిపాటి ఎంచుకున్న నేపథ్యం, ఈ కథను పతంగుల పోటీ నేపథ్యం అల్లుకోవడం కొత్తగా  ఉంది. దర్శకుడు క్రియేట్‌ చేసిన పాత్రలు, వాటి చుట్టు సన్నివేశాలు కూడా అందర్ని అలరించే విధంగా ఫ్రెష్‌ ఫీల్‌ను కలిగిస్తాయి. దర్శకుడు పాత్రలో కనిపించిన గౌతమ్‌ వాసుదేవ మీనన్‌తో కలిసి హీరోయిన్‌ కథను చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. సినిమా మొత్తం కలర్‌ఫుల్‌గా ఫ్రెష్‌ సీన్స్‌తో, క్యూట్‌ లవ్‌సీన్స్‌తో, యూత్‌ఫుల్‌ సంభాషణలతో, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కొనసాగుతుంది. ఇద్దరూ స్నేహితులు, ఓ అమ్మాయి మధ్య లవ్‌స్టోరీతో ఫస్టాఫ్‌ చాలా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో పతంగుల పోటీ సన్నివేశాలు సినిమాకు ప్రాణంగా నిలిచాయి. ఇప్పటి వరకు తెలుగు తెర మీద ఎన్నో స్పోర్ట్స్‌ డ్రామాలు వచ్చాయి. కానీ పతంగుల పోటీతో వచ్చిన తొలి సినిమా ఇదే. పతాక సన్నివేశాలు ఈ సినిమాను మరింత రక్తికట్టించాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో కైట్‌ కాంపిటీషన్‌కు నటుడు విష్ణు ఇచ్చిన కామెంటరీ హిలేరియస్‌గా ఉంటుంది. ఓవరాల్‌గా 'పతంగ్‌' ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. 

నటీనటుల పనితీరు:
హీరోలు వంశీ పూజిత్‌, ప్రణవ్‌ కౌశిక్‌లు తమ నటనతో, ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా మాస్‌ పాత్రలో వంశీ పూజిత్‌ చేసిన హంగామా మన గల్లీ కుర్రాళ్ల మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ప్రణవ్‌ డ్యాన్సులు, స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగుంది. ఇన్‌స్టాలో వీడియోలు చేస్తూ అందరికి సుపరిచితమైన ప్రీతి పగడాల తన అమాయకత్వమైన నటనతో, కన్‌ఫ్యూజ్‌ అయ్యే అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ప్రెజెన్స్‌ సినిమాకు ప్లస్‌ అయ్యింది. ఫ్రెండ్స్‌ పాత్రల్లో నటీనటులు కూడా ఎంతో బస్తీలో ఉండే వారిలా ఎంతో సహజంగా కనిపించారు. దర్శకుడు తన మొదటి సినిమా అయిన ఎంతో ప్రతిభావంతంగా ఓ యూత్‌ఫుల్‌ సినిమాను తెరకెక్కించాడు. యూత్‌ఫుల్‌ సినిమా అయినా  ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఎలాంటి డబుల్‌ మీనింగ్‌ లేకుండా క్లీన్‌గా ఉంటుంది. ఇది దర్శకుడి టాలెంట్‌కు మరో ఉదాహరణ. తప్పకుండా డైరెక్టర్‌గా భవిష్యత్‌లో ప్రణీత్‌ నుంచి మంచి సినిమాలు ఆశించవచ్చు. జోస్‌ జిమ్మి సంగీతం సినిమాకు ప్లస్‌ పాయింట్‌గా నిలిచింది. శక్తి అరవింద్‌ కెమెరా ప్రతిభ సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ని కలర్‌ఫుల్‌గా మలిచింది.

ఫైనల్‌గా : 'పతంగ్‌'ల పోటీల నేపథ్యంలో వచ్చిన ఈ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీలో అన్ని సమపాళ్లలో కుదిరాయి. నేటి తరానిని నచ్చే కథతో తెరెకెక్కిన క్లీన్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ తప్పకుండా అందరిని మెప్పిస్తుంది.