Vivek Venkataswamy: కొందరు సొంత పార్టీకి ద్రోహం చేశారు.. వారిని ఉపేక్షించబోం: మంత్రి వివేక్
- నేడు చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన వివేక్
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి
- ఇసుక మాఫియాకు పాల్పడే వారిని వదిలేది లేదని హెచ్చరిక
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఒకవైపు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూనే, మరోవైపు అక్రమాలు, పార్టీ ద్రోహాలపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్రైస్తవ సోదరులను కలిశారు.
పర్యటనలో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, చెన్నూరును అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో సోలార్ విద్యుత్ సరఫరా అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో రైతులు, గ్రామీణ ప్రజలకు విద్యుత్ భారం తగ్గించేలా పునరుత్పాదక శక్తిపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.
పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడుతూ, కొందరు పార్టీకి ద్రోహం చేశారని వివేక్ కీలక ఆరోపణలు చేశారు. అక్రమార్కులకు అండగా నిలబడి, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడేవారికి అధికారులు, పోలీసులు వత్తాసు పలకడం తక్షణమే ఆపాలని మంత్రి హితవు పలికారు. చెన్నూరులో ఇసుక మాఫియాకు ఎలాంటి చోటు లేదని మంత్రి తేల్చిచెప్పారు. సొంత పార్టీకి చెందిన వారైనా సరే, అక్రమాలకు పాల్పడితే వదిలిపెట్టేది లేదని గట్టిగా హెచ్చరించారు.