Mount Kilimanjaro: కిలిమంజారో పర్వతంపై విషాదం.. హెలికాప్టర్ కూలి ఐదుగురి మృతి

Five killed in helicopter crash on Mount Kilimanjaro
  • కిలిమంజారో పర్వతంపై కూలిన రెస్క్యూ హెలికాప్టర్
  • అనారోగ్యానికి గురైన పర్యాటకులను రక్షించేందుకు వెళ్తుండగా ఘటన
  • మృతుల్లో ఇద్దరు చెక్ రిపబ్లిక్ పర్యాటకులు, పైలట్, డాక్టర్, గైడ్
టాంజానియాలోని కిలిమంజారో పర్వతంపై ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న పర్యాటకులను రక్షించేందుకు వెళ్లిన హెలికాప్టర్ బరాఫు క్యాంప్ వద్ద కూలిపోయింది.

ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురూ మరణించినట్లు టాంజానియా సివిల్ ఏవియేషన్ అథారిటీ (TCAA) ఇవాళ‌ ఒక ప్రకటనలో వెల్ల‌డించింది. మృతుల్లో ఇద్దరు చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన పర్యాటకులు, ఒక జింబాబ్వే పైలట్, ఒక టాంజానియా డాక్టర్, మరో స్థానిక పర్వత గైడ్ ఉన్నారని పోలీసులు గుర్తించారు.

ఇద్దరు చెక్ రిపబ్లిక్ పర్యాటకులకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వారిని అక్కడి నుంచి తరలించేందుకు ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. టాంజానియాకు చెందిన ఒక సంస్థకు చెందిన ఎయిర్‌బస్ H125 హెలికాప్టర్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు కిలిమంజారో ప్రాంతీయ పోలీస్ కమాండర్ సైమన్ మైగ్వా తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.

ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వతమైన కిలిమంజారో, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను, పర్వతారోహకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టాంజానియా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కిలిమంజారో పర్వతంపై కేబుల్ కార్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో అధికారులు ప్రకటించారు. పర్యాటకులు సులభంగా పర్వత ప్రాంతాలకు చేరుకునేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు.
Mount Kilimanjaro
Kilimanjaro helicopter crash
Tanzania
helicopter accident
Mount Kilimanjaro
Barrafu Camp
Tanzania Civil Aviation Authority
Czech Republic tourists
rescue operation
mountain tourism

More Telugu News